Tiger Wandering in Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో 16 రోజులుగా ప్రజలను హడలెత్తిస్తున్న పులి.. అడవి దారి పట్టినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అది వచ్చిన దారినే వెనక్కి మళ్లుతోందని గుర్తించినట్లు వెల్లడించారు. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం వద్ద పులి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చంద్రబాబుసాగర్, సుబ్బారెడ్డిసాగర్ గుట్టల పరిసరాల్లో అది సంచరిస్తున్నట్లు తెలిపారు. రాత్రి రెండు గేదెలపై పులి దాడి చేయబోగా.. అవి తప్పించుకున్నాయని అధికారులు తెలిపారు. అది కిత్తమూరిపేట కొండ ఎక్కితే రాజవొమ్మంగి వైపు అడవుల్లోకి పయనించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పులి దృష్టి ఇప్పటివరకూ మనుషుల మీద పడలేదని.. దాని స్వభావం మారేలా మనం ప్రవర్తిస్తే ప్రమాదకర పరిణామాలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అది అడవి వైపు వెళ్తున్నందున.. అలా వెళ్లిపోయేలా సిబ్బంది ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పులి వెనక్కి మళ్లినా, లేదంటే అక్కడే తిష్ట వేసి దాడులు చేసినా.. మత్తు మందు ఇచ్చి బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు స్పష్టం చేశారు. పులి అడవి వైపునకు మళ్లుతున్న ఈ తరుణంలో పరిసర గ్రామాల ప్రజలు సంయమనం పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: