CC cameras are not working in Kakinada: ఆకర్షణీయ నగరం కాకినాడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నిఘా కెమెరాల వ్యవస్థ అటకెక్కింది. 98 కోట్ల రూపాయలతో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. నగరమంతా అధునాత కెమెరాలు అమర్చినా.. ఆ విభాగం మూలన పడింది. నగరపాలక సంస్థ నిర్వహణనను గాలికి వదిలేయడంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది.
ఆకర్షణీయ నగరం కాకినాడలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోనే ఆధునిక నిఘా కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నేరస్తుల గుర్తింపు, ప్రమాదాల తీరు తెన్నులు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే వారిని గుర్తించడం.. ఇలా నగరంలో ఎలాంటి నేరాలు, ఘటనలు జరిగినా వెంటనే కెమెరాల్లో నిక్షిప్తమయ్యేలా 98 కోట్ల రూపాయలతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. 300 కెమెరాలను వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కి అనుసంధానం చేశారు. ఈ నిఘా కెమెరాల నిర్వహణ బాధ్యతల్ని సెర్లెట్ సంస్థకు అప్పగించారు. మూడున్నర ఏళ్లపాటు చక్కటి సేవలు అందించిన ఈ వ్యవస్థ నిర్వహణ గాలికి వదిలేయడంతో మూలనపడింది. ప్రభుత్వం నిర్వహణ సంస్థకు చెల్లించాల్సిన నిధులు ఆపేయడంతో ఈ నిఘా కెమెరా వ్యవస్థ మూలన పడింది. అది మాత్రమే కాకుండా 30 మంది సిబ్బందిని సెర్లెట్ సంస్థ నుంచి ఆరు నెలల క్రితం తొలగించారు. దీంతో నిఘా కెమెరాల కార్యకలాపాలు నిలిచిపోయాయి.
కమాండ్ కంట్రోల్ రూం కార్యాలయాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నాయకులతో కలిసి సందర్శించగా.. అందులో కేవలం ఓ ఉద్యోగి మాత్రమే విధులు నిర్వహిస్తూ కనిపించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. ఎంతో పటిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇలా నిధులు నిలిపి వేయడంతో ఆగిపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేర కార్యకలాపాల నియంత్రణ, విచారణలో ఎంతో మెరుగైన సేవలు అందించే నిఘా కెమెరాల వ్యవస్థ నిరుపయోగంగా మారడంపై కాకినాడ వాసులు ఆవేదన చెందుతున్నారు. నేరాలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితుల్లో అదుపునకు ఎంతో ఉపయుక్తంగా ఉండే వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని కోరుతున్నారు.
కాకినాడ ప్రజలు ఏ విధంగా ఉండాలని కోరుకున్నారో.. ఆ విధంగా అభివృద్ది చేయడానికి స్మార్ట్ సిటీని తెచ్చుకున్నాం.. అందులో భాగంగా కమాండ్ కంట్రోల్ రూం కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం.. ఎందుకు పెట్టాము అంటే ఈ కాకినాడ నగరంలో ఎక్కడ ఏమి జరిగినా తెలియాలి.. అందరికీ మంచి జరిగే విధంగా ఉంటుందని. ఏన్నోసార్లు నడి రోడ్డు మీద నేరాలు జరిగాయి.. ఇలాంటివన్నీ అరికట్టడానికి నిఘా కెమేరాలు పెట్టాలని చెప్పి అప్పుడు 98 కోట్లతో నగరంలో కెమేరాలు పెట్టి కమాడ్ కమ్యునికేషన్ సెంటర్ పట్టాము.- కొండబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: