Janasena Party varahi Yatra updates: ''వచ్చే ఎన్నికల్లో విడిగా వస్తానో.. ఉమ్మడిగా వస్తానో.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు గానీ, ఎలా వచ్చినా అసెంబ్లీలో అడుగుపెట్టడం మాత్రం ఖాయం. ఒక్కసారి సీఎంను చూసి చూడండి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతా. వైఎస్సార్సీపీకి ఇంకో అవకాశం ఇస్తే రాష్ట్రంలో ఎవ్వరినీ బతకనివ్వదు. తవ్వే కొద్ది ఆ పార్టీ దోపిడీ బయటకు వస్తోంది. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి తాట తీస్తా. వైసీపీ గూండాలను తరిమి తరిమి కొడతా.'' అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'వారాహి విజయ యాత్ర'లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. వారాహి యాత్ర మొదలైన రోజు నుంచి ఈరోజు దాకా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి నుంచి వినతులను స్వీకరిస్తూ.. అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ ఏయే కార్యక్రమాలు, పథకాలు చేయనుందో..? ప్రజలకు పవన్ కల్యాణ్ తెలియజేస్తూ.. ముందుకు సాగుతున్నారు.
ఈ నెల 14న వారాహి యాత్ర ప్రారంభం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 14వ (బుధవారం) తేదీన 'వారాహి విజయ యాత్ర' పేరుతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనకు ముందు పవన్ కల్యాణ్.. అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆ తర్వాత యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా ఆయన.. ప్రజలు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశమవుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అనంతరం వారి నుంచి వినతులను స్వీకరిస్తూ.. పలు రకాల హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
సీఎం స్థానమిస్తే.. ఏపీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతా.. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కత్తిపూడి, పిఠాపురంలో ఏర్పాటు చేసిన భారీ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ.. సీఎం జగన్‌పై, వైసీపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ''వైఎస్సార్ కాంగ్రెస్ పార్టికీ ఇంకో అవకాశం ఇస్తే రాష్ట్రంలో ఎవ్వరినీ బతకనివ్వదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతలకు గుణపాఠం చెప్పాలి. తవ్వే కొద్ది ఆ పార్టీ దోపిడీ బయటకు వస్తోంది. ఆంధ్రప్రదేశ్ గుండాలకు, నేరస్థులకు నిలయంగా మారింది. అధికారంలోకి వచ్చాక ప్రజా కోర్టులు నిర్వహించి.. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. వైసీపీ పాలనలో 219 హిందూ విగ్రహాలను ధ్వంసం చేశారు. కానీ ఏ ఒక్కరినీ ప్రభుత్వం పట్టుకోలేదు. ముఖ్యమంత్రి స్థానం ఇస్తే రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతా. వచ్చే ఎన్నికల్లో విడిగా వస్తానో.. ఉమ్మడిగా వస్తానో.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు గానీ, ఎలా వచ్చినా అసెంబ్లీలో అడుగుపెట్టడం మాత్రం ఖాయం'' అని ఆయన అన్నారు.
సీఎం జగన్‌పై పవన్ నిప్పులు.. వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్.. గొల్లప్రోలులో రైతులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత గొల్లప్రోలు నుంచి పిఠాపురం వరకు వారాహి వాహనంలో రోడ్డు షో నిర్వహించారు. పిఠాపురంలో అభిమానులు పోటెత్తడంతో సభ వద్దకు ఆలస్యంగా వచ్చారు. అనంతరం అక్కడి ఏర్పాటు చేసిన సభలో వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్‌పైనా తన శైలిలో విరుచుకుపడ్డారు. పిఠాపురంలో ధ్వంసమైన దేవతా విగ్రహాలను ఓ పిచ్చోడు ధ్వంసం చేసినట్లు ప్రభుత్వం తేల్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధ్వంసమైన 219 దేవాలయాల్లోని విగ్రహాలను పిచ్చోళ్లే ధ్వంసం చేశారా..? అని పవన్ ప్రశ్నించారు. దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం పూనుకోవడం లేదన్నారు. జగన్ హయంలో ప్రభుత్వం గూండాలకు నిలయంగా మారిందన్నారు. గూండాలు, రౌడీలు, హంతకులు మనల్ని పాలిస్తున్నారని.. ఇలాంటి నేరచరిత్ర ఉన్న వారిని ఎన్నుకున్నందుకు మనకు సిగ్గుండాలన్నారు.
అమిత్ షా వద్ద వైసీపీ నాయకుల నేర జాబితా ఉంది.. రాష్ట్రం గూండాలకు అడ్డాగా మారిందనే దానికి విశాఖలో తాజాగా ఎంపీ భార్య, కొడుకును కిడ్నాప్ చేయడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం మత్తులో జోగుతోందని.. గంజాయిని అడ్డగోలుగా తెచ్చి యువతో తాగిస్తోందని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గ సమస్యల్ని ఓపిగ్గా విన్న పవన్.. ఏలేలు ఆధునికీకర పనులు చేపట్టలేదని, ఉప్రాడ తీర ప్రాంతానికి రక్షణ గోడ నిర్మించలేదని.. మట్టి, ఇసుక మాత్రం బొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన సంగతి కాకినాడలో తేల్చుకుంటామన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద ద్వారంపూడితోపాటు వైసీపీ నాయకుల నేర జాబితా ఉందన్నారు. అధికారంలోకి వస్తే పిఠాపురంను ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దుతామని పవన్ ప్రకటించారు.
''మంగళవారం అన్నవరం దేవస్థానానికి వెళ్తే..ఎవరో నా రెండు చెప్పులు కొట్టేశారు. ఎవరు నా చెప్పులు కోట్టేసింది. అతను మీకు కనిపిస్తే వెంటనే పట్టుకోండి. నా చెప్పులు నాకు ఇప్పించండి. ముఖ్యమంత్రి కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకు ప్రజల ఆశీర్వాదం కావాలని అందర్నీ విజ్ఞప్తి చేస్తున్నా. -పవన్ కల్యాణ్, జనసేన అధినేత
Pawan Kalyan Varahi Tour : వారాహి యాత్రకు సర్వం సిద్ధం.. సాయంత్రం అన్నవరం నుంచి వారాహియాత్ర