Covid Cases In Andhra Pradesh : రాష్ట్రంలో కొవిడ్ కేసులు చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జే నివాస్ తెలిపారు. వాటి తీవ్రత కూడా స్వల్పంగానే ఉందని వివరించారు. ఇటీవలే కాకినాడలో కొవిడ్‌తో ఇద్దరు వ్యక్తులు మరణించారనే విషయం తమ దృష్టికి వచ్చిందని.. దానిపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. మరణించిన వారికి ఇతర అనారోగ్య సమస్యలున్నాయని.. వాటిపై కూడా ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు.
అసలేంటి కాకినాడలో కరోనా మరణాలు : కాకినాడ జిల్లాలో కొవిడ్‌తో నిమోనియా సోకి ఓ యువకుడు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీంతో జిల్లా యంత్రాగం అప్రమత్తమైంది. జిల్లాలో కొవిడ్ నిర్దరాణ పరీక్షలలో వేగం పెంచింది. కాకినాడ జీజీహెచ్‌లో సుమారు 46 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని.. ఎప్పటికప్పుడు కొవిడ్ నిర్దారణ పరీక్షలను చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జే నివాస్ వెల్లడించారు. దేశంలో వైద్యా ఆరోగ్య విభాగాన్ని బలోపేతం చేయటానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఎకోని.. రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వైద్య సిబ్బందికి.. మాతా శిశు సంరక్షణ, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలు పెంచడం వంటి అంశాలలో శిక్షణ అందించటంలో భాగమని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో నూతనంగా మరో ఐదు వైద్య కళాశాలు ఈ సంవత్సరంలో రానున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి టి.కృష్ణబాబు తెలిపారు. ఇప్పటికే విజయనగరంలోని వైద్య కళాశాలకు అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. మరో మూడు కాలేజీలకు ఎన్ఎంసీ అధికారులు తనీఖీలను నిర్వహించారని.. వాటికి అనుమతులు వస్తాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఇప్పటికే ప్రారంభించామని.. గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యం అందించేలా వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని వివరించారు. గ్రామ స్థాయిలోనే దాదాపు 80 శాతం రోగాలకు చికిత్స అందించాలనేది తమ ప్రయత్నమని ఆయన అన్నారు. రాష్ట్రంలో గత రెండున్నర సంవత్సరాలలో 48 వేల మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. దేశంలోని వైద్యా ఆరోగ్య రంగంలో ఏపీ రోల్ మోడల్ కాబోతుందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభించిన తర్వాత ప్రతి వ్యక్తి ఆరోగ్య డేటా నిర్వహిస్తున్నమన్నారు.
ఇవీ చదవండి :