Aided Schools are Closing Under Jagan Government: సభల్లో మన సీఎం గారి మాటలు కోటలు దాటుతాయి కానీ వాస్తవ పరిస్థితుల్లో ఎయిడెడ్ విద్యాసంస్థల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. వాటిలో చదువుతున్న పేద పిల్లలపై కక్షగట్టినట్లు ఉంది. వీటిని మూసివేసి పేదలకు విద్యను దూరం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉపాధ్యాయులను నియమించక పోగా.. వీటిలో ఆంగ్ల మాధ్యమాన్ని పెట్టుకుంటామని యాజమాన్యాలు అడుగుతున్నా.. అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వ బడుల్లో ఎన్నో చేస్తున్నామని చెబుతున్న సీఎం జగన్ ఎయిడెడ్‌పై ఎందుకు వివక్ష చూపుతున్నారు..? ఈ పాఠశాలల్లో చదివే వారు పేద పిల్లలు కాదా..? వారిపై ఎందుకు అంటరానితనాన్ని ప్రదర్శిస్తున్నారు ? ఆంగ్ల మాధ్యమం పెట్టుకోవాలంటే అన్ ఎయిడెడ్‌లో పెట్టుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
Aided schools: ఊరిలోని బడికి ఉరేసి.. విద్యకు చరమగీతం పాడుతున్న జగనన్న ప్రభుత్వం
Aided schools for Implementation of Telugu Medium: తెలుగు మాధ్యమం అమలుకే ఎయిడ్ ఇచ్చినందున మార్పు చేయడం కుదరదంటూ దరఖాస్తులను మూలనపడేస్తోంది. మరోపక్క ఎయిడెడ్ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా బడులను నిర్వీర్యం చేస్తోంది. పేదలకు ఇంటి సమీపంలోనే ఉన్న పాఠశాలను లేకుండా చేస్తోంది. పేదలను గ్లోబల్ విద్యార్థులుగా తయారు చేస్తున్నామని.. పదేపదే చెప్పే సీఎం జగన్.. ఇలాగేనా తయారు చేసేది..? ఎయిడెడ్ బడుల్లో చదువుతున్నది పేదలు కాదా..? వీరిపై వివక్ష చూపడం.. పాఠాలు చెప్పే వారు లేకుండా చేయడం అంటరానితనం కాదా..? ఇది ప్రభుత్వ పెత్తందారి విధానం కాదా..?
Aided schools aim to impart Education: విద్యాదానం చేసే ఉద్దేశంతో గతంలో దాతలు ఎయిడెడ్ పాఠశాలలను ఏర్పాటు చేశారు. వీటిలో చదువుకున్న ఎందరో గొప్పవారయ్యారు. ఇవి ఉండటంతో ప్రభుత్వం పక్కనే సర్కారు బడులను ఏర్పాటు చేయలేదు. బాపట్ల జిల్లా జే. పంగులూరు మండలం ముప్పవరంలోని ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో తెలుగు మాధ్యమం ఉంది. ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అయిదో తరగతి వరకు ఉంది. ఆ తర్వాత చదవాలంటే వీరు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని అద్దంకి, పంగులూరుకు వెళ్లాల్సి వస్తోంది. ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.
Aided schools do not have English medium: ఎయిడెడ్ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని పెట్టుకోవాలంటే అన్ఎయిడెడ్ విభాగంలో పెట్టుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. దీంతో కొన్ని యాజమాన్యాలు ప్రైవేటుగా ఆంగ్ల మాధ్యమాన్ని పెట్టుకుంటున్నాయి. రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకుండా ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు మూడేళ్ల పాటు ఒప్పంద ఉపాధ్యాయులనే పెట్టుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్కన భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాలు ఉండవు. ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యాకానుక, బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్లు ఇస్తోంది. ఉపాధ్యాయులను మాత్రం నియమించడం లేదు. ద్విభాష పాఠ్యపుస్తకాలు కావడంతో విద్యార్థులు ఒకపక్క ఉండే తెలుగు భాషను చదువుకుని పరీక్షలు రాస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం పరీక్షలన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే రాయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు.
Aided schools closed due to government measures: ప్రభుత్వ చర్యల కారణంగా 163 ఎయిడెడ్ పాఠశాలలు మూతపడ్డాయి. వాటి ఆయువు తీసేస్తుండటంతో ప్రవేశాలు తగ్గి.. విద్యార్థులు లేక మూసేయాల్సిన దుస్థితి ఏర్పడింది. హేతుబద్ధీకరణ పేరుతో ఎయిడెడ్‌లో కొనసాగుతున్న 8 వందల 83 పాఠశాలల్లోనూ కొన్నింటికి చరమగీతం పాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల ప్రభుత్వం హేతుబద్ధీకరణకు ఆదేశాలివ్వగా.. యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో బ్రేకు పడింది. 30 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలను కిలోమీటరు దూరంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో 35 మంది లోపు విద్యార్థులు ఉంటే వీటిని మూడు కిలోమీటర్ల దూరంలోని బడుల్లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇది అమల్లోకి వస్తే ఎయిడెడ్ పాఠశాలలు చాలా వరకు మూతపడతాయి.