YSRCP Government Stop Financial Aid : పేదల విద్య గురించి జగన్ ఎంత తాపత్రయం అంత మాటల్లోనే! చేతల్లో అనేక మంది పేద పిల్లల్ని చదువుకు దూరం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. కాకినాడలోని ఐడియల్ ఎయిడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులు. జగన్ మాటల్లో నిజాయతీ ఉంటే మా కాలేజ్ మాక్కావాలని అని ఈ పేద పిల్లలకు రోడ్డెక్కాల్సిన ఖర్మ ఎందుకు పడుతుంది. ఐనా జగన్ మనసు కరగలేదు. 52 ఏళ్ల పాటు అనేక ప్రభుత్వాల సాయం అందుకుంటూ ఎంతో మంది నిరుపేదల చదువులకు నిచ్చెనలా నిలిచిన ఈ విద్యాలయం జగన్ సర్కార్ సాయానికి నోచుకోలేకపోయింది. ప్రభుత్వం ఎయిడెడ్ నిలిపివేయడంతో ఇప్పుడు సొంతగానే నెట్టుకొస్తోంది. గతంలో ఇక్కడ ఇంటర్మీయట్ కూడా ఉండేది. వైఎస్సార్సీపీ సర్కార్ సాయం ఆపేయడంతో ఇప్పుడు డిగ్రీకళాశాల మాత్రమే ఉంది. అదీ ప్రైవేటుగా కొనసాగుతోంది. ఇలా పేద పిల్లల చదువుకు పొగపెట్టడం అంటరానితనం కాదా సీఎం సార్.
Aided Educational Institutions Situation in AP : జగన్ ఏలుబడిలో ఐడియల్ కాలేజ్‌ల్లాంటి ఎన్నో విద్యాధామాలు నిర్వీర్యమయ్యాయి. జగన్ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో 2వేల202 ఎయిడెడ్ పాఠశాలలుంటే,అందులో 837 మాత్రమే మిగిలాయి. మరో 845 బడులు సిబ్బందిని వెనక్కి ఇచ్చి, ప్రైవేటుగా మారిపోయాయి. 423 కనుమరుగయ్యాయి. 122 జూనియర్ కళాశాలలకుగాను ఇప్పుడు కేవలం 44 మాత్రమే మిగిలాయి. జగన్‌కు అభివృద్ధిలో పక్షపాతం ఉంటుందేమోగానీ విధ్వంసంలో ఉండనే ఉండదు.
Aided schools: ఊరిలోని బడికి ఉరేసి.. విద్యకు చరమగీతం పాడుతున్న జగనన్న ప్రభుత్వం
Education System Under Jagan Regime : సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి కడపలోనూ 30 ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఇప్పుడు ఐదే మిగిలాయి. ఎయిడెడ్ వ్యవస్థపై జగన్ సాగించిన దమనకాండతో గతంలో బడుల్లో 2లక్షల 8 వేల మంది విద్యార్థులుంటే ఇప్పుడు ఆ సంఖ్య లక్షా ఒక వెయ్యికి తగ్గిపోయింది. ఈ నాలుగున్నరేళ్లల్లో లక్ష మంది పిల్లలు గత్యంతరం లేక ఎయిడెడ్ నుంచి ప్రైవేటుకు వెళ్లిపోయారు. వీరందరిపైనా ఫీజుల రూపంలో ఆర్థిక భారం మోపిన పెత్తందారీ ఎవరు జగన్? అందులోని పిల్లలు నీ ఎస్సీ, నీ ఎస్టీ, నీ బీసీ, నీ మైనారిటీ కాదా ముఖ్యమంత్రిగారూ?
Education System in AP : తక్కువ ఫీజులతో పేదలకు నాణ్యమైన విద్యను అందించే ఎయిడెడ్ సంస్థలను కాపాడుకోడానికి లక్షలాది విద్యార్థులు రోడ్డెక్కారు. కానీ జగన్ మనసు కరగలేదు. ఆర్థిక భారం పేరుతో ఎయిడెడ్ విద్యాలయాల్ని కాలగర్భంలో కలిపేశారు. ఆస్తులతోసహా ప్రభుత్వానికి అప్పగించాలని లేదంటే ఎయిడెడ్‌లోని సిబ్బందిని అప్పగించి, ప్రైవేటుగా నిర్వహించుకోవాలని హుకుం జారీ చేశారు. క్షేత్రస్థాయి అధికారులు ఎయిడెడ్ యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చి, సిబ్బందిని వెనక్కి తీసేసుకున్నారు.
ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో విద్యా సంస్థలను నిర్వహించలేక కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వానికి ఇచ్చేశాయి. పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆగ్రహావేశాలతో ఓ దశలో వెనక్కి తగ్గినట్లు ప్రభుత్వం నటించింది. ఎయిడెడ్‌లో కొనసాగాలంటే కొనసాగొచ్చంటూ ఉత్తర్వులిచ్చింది ! తెర వెనుక మాత్రం వాటిని మూసేసే చర్యలేకొనసాగిస్తూనే ఉంది. తనిఖీల కొరడా తీసింది. పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నారని, మౌలిక సదుపాయాలు లేవనే సాకులతో ఎయిడెడ్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ క్షేత్రస్థాయి అధికారుల్ని ఉసిగొల్పింది.
జగనన్న సర్కారులో చదువులంటే విద్యార్థుల్లో గుండెల్లో గుబులే- శిథిలావస్థకు చేరినా పట్టించుకోని పాలకులు
ప్రకాశం జిల్లాలోని సెయింట్ పాల్ ఎయిడెడ్ విద్యా సంస్థల్నిఅలాగే బలితీసుకుంది. తనిఖీ సమయంలో ఇతర బడుల విద్యార్థులను తీసుకొచ్చి కూర్చొబెట్టారని, ఆట స్థలం, సామగ్రి, గ్రంథాలయం, ప్రయోగశాలలు, మరుగుదొడ్లు లేవంటూ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. ఇందులో ఎయిడెడ్‌ను ఏదో ఒకలా మూసేయాలనే కక్ష తప్ప వాటిని బాగు చేద్దామనే ఉద్దేశం ఏకోశానైనా ఉందా?
పేద పిల్లలు ఆంగ్లంలో చదవకూడదా అని ప్రశ్నించే జగన్ పేదలు చదివే ఎయిడెడ్‌కు మాత్రం ఆంగ్ల మాధ్యమం ఇవ్వడం లేదు! తెలుగు మాధ్యమానికి ఎయిడ్ ఇస్తున్నందున అందులోనే కొనసాగాలని తేల్చిచెప్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో మారేందుకు అనుమతి ఇవ్వాలని కొన్ని పాఠశాలలు చేసుకున్న దరఖాస్తులనూ ప్రభుత్వం పెండింగ్‌లో పెడుతోంది. కొన్ని యాజమాన్యాలు విసిగిపోయి అన్‌ఎయిడెడ్‌లో ఆంగ్ల మాధ్యమం నిర్వహిస్తున్నాయి. అంటే పిల్లలు అధిక ఫీజులు చెల్లించాల్సిందే.
ప్రభుత్వ బడులకు ఇచ్చే స్మార్ట్ టీవీలనూ ఎయిడెడ్‌కు మాత్రం ఇవ్వడం లేదు. అక్కడి పిల్లలు టోఫెల్ శిక్షణకు నోచుకోవడం లేదు. ఎయిడెడ్‌లో చదివే పేదవారికి డిజిటల్ బోధన అందించకపోవడం రూపం మార్చుకున్న అంటరానితనం కాదా? విద్యకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్తున్న జగన్‌కు ఎయిడెడ్ సంస్థలన్నింటికీ కలిపి వంద కోట్లు ఇచ్చేందుకు చేతులు రావడం లేదా? ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రైవేటుగా మారితే అందులోని పిల్లలకు మధ్యాహ్న భోజనం,. విద్యాకానుక, ట్యాబ్‌లులాంటివి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆ విధంగానూ జగన్ సర్కార్ నిధులు మిగుల్చుకుంటుంది.
ఎయిడెడ్ వ్యవస్థకు మంగళం పలకాలన్న జగన్ సర్కార్ ఆలోచన వెనుక విద్యాసంస్థల ఆస్తులు కొట్టేయాలనే దురాలోచన ఉందనే విమర్శలున్నాయి. చాలా ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులు నగర, పురపాలక సంస్థల పరిధిలో ఉన్నాయి. వాటిపై కన్నేసిన కొందరు వైకాపా నేతలు ఎయిడెడ్ విలీన ప్రతిపాదనలు తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ శివారు గొల్లపూడిలోని పోసాని నర్సింహరావు చౌదరి ఉన్నత పాఠశాలతోపాటు దానికి ఉన్న ఏడెకరాల పొలాన్ని పాఠశాల విద్యాశాఖకు దేవాదాయ శాఖ అప్పగించింది. 2.74ఎకరాల్లో పాఠశాల ప్రాంగణం ఉండగా మరోచోట పొలం ఉంది. కేబినెట్ హోదాలో ఉన్న ఓ నేత ఈ స్థలంపై కన్నేశారు.