YSRCP Candidates Fourth List Release : లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల నాలుగో జాబితాను వైఎస్సార్సీపీ విడుదల చేసింది. ఒక లోక్‌సభ, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు మార్పుల వివరాల్ని మంత్రి బొత్స సత్య నారాయణ (Minister Botsa Satya Narayana )సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వెల్లడించారు. వీటిలో ఒక్క కనిగిరి మినహా మిగిలినవన్నీ ఎస్సీ నియోజకవర్గాలే. నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులుచేర్పులపై కసరత్తు పేరుతో సీఎం జగన్ ఆయా నియోజకవర్గాల నేతల్ని పిలిచి మాట్లాడుతున్నప్పటికీ ఒకటీ అరా తప్ప అత్యధికశాతం ముందుగా తాను నిర్ణయించిన వారి పేర్లను ఖరారు చేస్తున్నారు.
2024 Elections in AP : నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గానికి స్థానికేతరుడు, కడపకు చెందిన డాక్టర్ సుధీర్‌ను సమన్వయకర్తగా నియమించాలనుకుంటున్నట్లు గతంలో ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పిలిచి సీఎం చెప్పారు. ఏదేమైనా స్థానికులకే టికెట్ ఇవ్వాలని బైరెడ్డి కోరారు. అయినప్పటికీ చివరికి సీఎం అనుకున్న సుధీర్‌నే ప్రకటించారు. సుధీర్‌కు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ యాజమాన్యం స్పాన్సర్ చేస్తున్నట్లు ఇప్పుడు పార్టీలో చర్చ సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్‌ను అసలు పరిగణనలోకే తీసుకోలేదు. తన చెప్పుచేతల్లో ఉండేవారికి టికెట్ ఇప్పించుకోవాలని బైరెడ్డి చేసిన ప్రయత్నమూ ఫలించలేదు.
వైఎస్సార్సీపీ ఇంఛార్జీల నాలుగో జాబితా విడుదల
దళితులంటేనే వైఎస్సార్సీపీ అధిష్ఠానానికి చిన్నచూపు. నాలుగో జాబితాలో 9 స్థానాల్లో మార్పులు చేస్తే అందులో 8 ఎస్సీలవే కావడం ఇందుకు నిదర్శనం. అందులోనూ నలుగురు ఎస్సీ, ఒక బీసీ ఎమ్మెల్యేలను పూర్తిగా పక్కన పెట్టేశారు. విజయవాడలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణను (DR BR Ambedkar Statue Inauguration) సామాజిక న్యాయ వేడుకగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతోంది. ఈ వేడుక సందర్భంగా దళిత ఎమ్మెల్యేలకు ఇచ్చిన బహుమతి వారి టికెట్లు చించేయడం. దళిత ఎమ్మెల్యేలు ఒకే నియోజకవర్గంలో వరుసగా పోటీ చేసి గెలిస్తే అక్కడ వారి నాయకత్వం బలపడుతుంది.
అప్పుడు అక్కడ అధిష్ఠాన పెద్దల సామాజికవర్గానికి చెందిన వారి పెత్తనం చెల్లకపోవచ్చుననే ఉద్దేశంతోనే ఇలా మార్పులు చేస్తున్నారు. గంగాధర నెల్లూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రెండోసారి గెలిచారు. ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉన్న మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి, ఆయన సామాజికవర్గానికి చెందిన నేతలు నారాయణస్వామిని వ్యతిరేకిస్తున్నారు. మరోసారి సీటు ఇస్తే ఇక నియోజకవర్గం తమ చెప్పుచేతల్లో ఉండరనే ఉద్దేశంతోనే వారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా పావులు కదిపి నారాయణస్వామిని మార్పించారనే ప్రచారం జరుగుతోంది.
వైఎస్సార్సీపీ నాలుగో జాబితాపై నేతల్లో ఆందోళన - ఈ సారి కరివేపాకులు ఎవరో?
తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి. వైఎస్సార్సీపీలో తొలి నుంచీ ఉన్నారు. 2019లో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని అందరు భావించారు. కానీ, తీసుకోలేదు. తర్వాత రెండోసారి మార్పుల సమయంలో కచ్చితంగా తీసుకుంటున్నట్లుగా ప్రచారం చేశారు. అప్పుడూ మొండిచెయ్యే చూపారు. అయినా ఆయన పార్టీ విధేయుడిగానే కొనసాగుతున్నారు. రాజకీయ సమీకరణాల కోసం ఆయన్ను ఇప్పుడు పూర్తిగా ముంచేశారు.
ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన స్వామిదాస్‌కు తిరువూరు టికెట్ ఖరారు చేశారు. శింగనమలలో సాగునీటి కోసం ప్రశ్నించిన ఎస్సీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని పక్కన పెట్టి ఆ టికెట్‌ను వీరాంజనేయులుకు ఇచ్చారు. ఇప్పటివరకూ 4 జాబితాల్లో 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేసిన మార్పుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు కలిపి 34 టికెట్లు ఎత్తేయగా వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే 21 మంది ఉన్నారు.
కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదనయాదవ్‌ను కందుకూరుకు మార్చాలని తొలుత భావించారు. అందులో భాగంగానే ఆయన్ను, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని గురువారం క్యాంపు కార్యాలయానికి సీఎం పిలిపించారు. ఏ నిర్ణయం తీసుకున్నా తానేమి అడగనని మహీధర్‌రెడ్డి నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కందుకూరులో మహీధర్‌రెడ్డినే యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం.
"ఆ డబ్బు ఇస్తే ఒంగోలులో చేస్తావు, లేదంటే గిద్దలూరుకు వెళ్తావు కదా!" బాలినేని, సీఎంల మధ్య మాటా మంతీ