గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన రైతు కుంభా వీరాంజనేయులు(30) పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. భార్య తిరుపతమ్మ కూలి పనులు చేస్తూ కుంటుంబానికి ఆసరాగా ఉంటుంది. వారికి ఇద్దరు కుమారులు. వీరాంజనేయులు సాగు కోసం అప్పులు చేశాడు. వ్యవసాయంలో వరుస నష్టాలతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగాయి. ఆర్థిక ఇబ్బందులు పచ్చని సంసారంలో చిచ్చు రేపాయి. తరుచూ ఇద్దరూ గొడవ పడుతూ ఉండేవారు. నాలుగు రోజుల క్రితం జరిగిన వాగ్వాదంతో తిరుపతమ్మ పుట్టింటికి వెళ్లింది. దీంతో వీరాంజనేయులు మనోవేదనకు గురై ఈ నెల 24న పొలంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అతని తండ్రి ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: నదీ పరివాహక ప్రాంతం... మరింత అప్రమత్తం