YCP Govt Paying Bills Only Jagan Followers: సినిమా టికెట్ల కోసం వరుసలో నిలుచుంటే పక్కనుంచి వచ్చి ఎవరైనా టికెట్లు తీసుకుంటేనే జనం గగ్గోలు పెడతారు. అలాంటిది ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు చెల్లింపుల్లో వరుస తప్పితే ఏమనాలి..? వరుస క్రమంలో కాకుండా తమకు నచ్చినవారికి పక్కదోవలో వేల కోట్ల పందేరం చేస్తుంటే అది ఎంత అక్రమం..? నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వం తమ అనుయాయులకు ఇలా పందేరం చేస్తోంది. ఈ చెల్లింపుల వెనుక పెద్ద బాగోతం చోటుచేసుకుందని ఉన్నతాధికారుల స్థాయిలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శికి రాష్ట్రంలోని చిన్న గుత్తేదారులు, సరఫరాదారులు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఫిఫో- ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతి తప్పించి ఇష్టానుసారం బిల్లులు ఎందుకు చెల్లిస్తున్నారో చెప్పాలని కోరింది. దీనిపై హైకోర్టులోనూ.. పెద్ద ఎత్తున వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తమకు, తమవారికి ప్రయోజనం కలిగించుకోవడంతో వ్యవస్థ గాడితప్పింది. లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చులో అనుయాయులకే ప్రయోజనం కలిగిస్తే అది ఎంత పెద్ద కుంభకోణం..? రాష్ట్రంలో ఇప్పుడదే జరుగుతోంది.
How CM Jagan Cheating AP People: పథకాల్లో 'కోతలు'.. ప్రసంగాల్లో 'కోతలు'.. పెత్తందారు 'ఎవరు' జగన్?..
బిల్లులు చెల్లింపుల్లో అవకతవకలపై కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి రాష్ట్రప్రభుత్వాన్ని వివరణ కోరినా జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరింత దూకుడు పెంచుతోందని సమాచారం. సంక్రాంతి లోపు దాదాపు 15వేల కోట్ల రూపాయల బిల్లులు ఇలా చెల్లించాలని ముఖ్యస్థాయిలో ఒక అంచనాకు వచ్చి ఆర్థికశాఖ అధికారులకు వర్తమానం పంపినట్లు తెలిసింది. అందుకు అవసరమైన ఆర్థికవనరుల సమీకరణ చేపట్టాలని ఉన్నతస్థాయి కీలక కార్యాలయం నుంచి ఆర్థికశాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏ అధికారి వెళ్లి బిల్లుల విషయం ప్రస్తావించినా ఆర్థికశాఖలో కీలక అధికారి చేతులెత్తేస్తున్నారు. తమకు కొన్ని ప్రాధాన్యాలు చెప్పారని అవి పూర్తయిన తర్వాతే ఇతర ఆంశాలకు నిధులు సర్దుబాటు చేయగలమని ఆయన సమాధానం చెబుతున్నారు.
New Liquor Policy in AP: మద్య నిషేధమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఆ హామీని మరిచి..!
15 వేల కోట్ల సమీకరణ ఎలా అన్న అంశాలపైనా ఇటీవల ఆర్థికశాఖలో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో జనవరి నెలాఖరులోపు నిధులు ఎలా సమీకరించాలనే కోణంలో చర్చలు సాగినట్లు తెలిసింది. ఇప్పటికే బహిరంగ మార్కెట్ రుణపరిమితి మేరకు 42 వేల 500 కోట్ల రూపాయల రుణాలు సమీకరించేశారు. మరో 20 వేల కోట్లకు పైగా ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి ఇతర బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించింది. ఇవి కాకుండా బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా వేలకోట్ల రుణం తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా.. రిజర్వుబ్యాంకులో చుక్కెదురైంది. ఓపీఎస్‌కు వెళ్లకపోతే సీపీఎస్‌లో ఉద్యోగుల వాటా, రాష్ట్రప్రభుత్వ వాటా మొత్తానికి సమంగా అదనపు రుణం సమకూరుస్తామని కేంద్రం గత ఆర్థిక సంవత్సరంలోనే హామీ ఇచ్చింది.
జీపీఎస్ చట్టం చూపించి.. కేంద్రం ఇస్తానన్న రుణం 9 వేల కోట్ల రూపాయల వరకు సమీకరించవచ్చని ఆర్థికశాఖ అధికారులు భావిస్తున్నారు. జనవరి లోపు ఎంత తీసుకోగలమన్న అంశమూ చర్చిస్తున్నారు. అంతేకాకుండా.. పోలవరం తొలిదశ నిధులకు 19వేల కోట్ల రూపాయల మేర ప్రతిపాదనలు పంపారు. అందులో 10వేల కోట్లు అడ్వాన్సుగా అడుగుతున్నారు. ఆ నిధులు రాబట్టే విషయంలోనూ.. ఆర్థికశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇలా అనుయాయులకు 15వేల కోట్ల వరకు వచ్చే నాలుగు నెలల్లో చెల్లించాలనే ముఖ్య ఆదేశాల మేరకు కొందరు ఆర్థికశాఖ అధికారులు ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. ఈ ప్రాధాన్యాలతో ఇతర అనేక చెల్లింపులూ నిలిపివేశారు.
బిల్లుల చెల్లింపులకు గత ప్రభుత్వ హయాంలో.. సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థను రూపొందించారు. అన్ని ప్రభుత్వ శాఖలనూ ఒకే పోర్టల్‌లోకి తీసుకొచ్చి ఏకకాలంలో అందరికీ సమాచారం తెలిసేలా ఈ విధానం రూపొందించారు. బడ్జెట్ మంజూరు, అందుబాటు, బిల్లుల స్వీకరణ, చెల్లింపుల విషయాలు శాఖలన్నింటికీ స్పష్టంగా తెలిసేది. ఇందులో బిల్లుల చెల్లింపులకు ఫిఫో విధానం అమలుచేసేవారు. బిల్లులు అన్ని దశలూ దాటి సీఎఫ్‌ఎంఎస్(CFMS)కు చేరాక కచ్చితంగా వరుస క్రమంలోనే చెల్లింపులు సాగేవి. ఒకవేళ వరుస తప్పితే అక్కడ క్రమం తప్పడానికి గల కారణాలు బాధ్యులైన అధికారి కచ్చితంగా నమోదు చేయాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇందులో మార్పులు చేశారు.
గాడితప్పి బిల్లులు చెల్లించే క్రమంలో అక్కడ రిమార్కు నమోదు చేసే విధానాన్నిమార్చారు. ఇష్టారీతి చెల్లింపులకు తెర తీశారు. ఇక్కడే అనుయాయులకు ప్రయోజనాలు అందించేందుకు వీలు దక్కింది. సీఎఫ్‌ఎంఎస్-2 విధానంలో జలవనరులశాఖ ప్రాజెక్టుల బిల్లుల చెల్లింపులకు కొత్త ప్రోగ్రాం రూపొందించారు. జావా సాఫ్ట్‌వేర్‌లో దీన్ని రూపొందించారు. ఇందులో మార్పులేవీ నమోదు కావు. అక్రమాలకు తావిచ్చేలా ఈ వ్యవస్త ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అనుయాయులకే ప్రాజెక్టుల బిల్లులు దక్కుతున్నాయనేది బహిరంగ రహస్యంగా మారిపోయింది. బడా గుత్తేదారులకు, పాలకుల సన్నిహిత గుత్తేదారులకే వందల, వేల కోట్ల సొమ్ములు అందుతున్నాయి.