YSRCP Government Neglecting Gram panchayat: 'మన భారతీయ ఆత్మంతా కూడా మన గ్రామాల్లోనే ఉందని.. మహాత్మా గాంధీ తెలిపారు. ఏ రోజైతే గ్రామాలు లేకుండా పోతాయో ఆ రోజున భారతదేశమే లేకుండా పోతుందని మహాత్ముడు అన్నారు. అటువంటి గ్రామాల్లో అభివృద్ధి ఫలాలు, పరిపాలన ప్రతి గడప దగ్గరకు తీసుకెళ్లాలనే తపన, ఆరాటంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాము. ఏ రాష్ట్రంలో లేని విధంగా రూపొందించాము' అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవంలో అన్నారు.
'ఆర్థిక సంఘం నిధులు ఒక్క రూపాయి కూడా అందలేదు. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం ఏదీ చేయలేకపోతున్నాము. ప్రజలు మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా ఉంది. ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పలేకపోతున్నాము' అని పి. గన్నవరం సర్పంచ్ ఇలా అన్నారు.
'రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించకపోగా.. కేంద్రం ఇవ్వాల్సిన నిధులను తీసుకుని కొల్లగొడుతోంది. గతంలో ఏయే ప్రభుత్వాలు ఉన్నాయే అవన్ని ఉచితంగా విద్యుత్ అందించాయి. ఇప్పుడు విద్యుత్ వంకతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను లాగేసుకుంటోంది. మాకు ఇవ్వాల్సిన నిధులను మాకు చెల్లించాలి' అంటూ కె. ముంజవరం సర్పంచ్ కోరారు.
ఇదీ జగనన్న మాటలకు, చేతలకు ఉన్న తేడా.. భారతీయల ఆత్మంతా గ్రామాల్లోనే ఉదని గాంధీజీ చెప్పిన మాటల్ని గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభోత్సవంలో ఉటంకించారు జగన్. దానికి పూర్తి విరుద్ధంగా జగన్ పాలన ఉందంటూ గాంధీజీకే మొరపెట్టుకున్నారు కోనసీమ జిల్లాకు చెందిన మహిళా సర్పంచ్‌లు.
వైఎస్సార్సీపీ మద్దతుతో గెలిచిన మెజార్టీ సర్పంచ్‌లదీ ఇదే ఆక్రందన. నిజానికి గ్రామ సచివాలయ వ్యవస్థతోనే రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన పంచాయతీల పాలనకు ఉరి బిగించింది. పేరుకు సర్పంచులున్నా.. పంచాయతీలపై ఎమ్మెల్యేల పెత్తనమే కొనసాగుతోంది. వాలంటీర్ల పేరుతో తెచ్చిన సమాంతర వ్యవస్థతో.. సర్పంచ్‌ల పాత్ర మరింత కుంచించుకుపోయింది.
సచివాలయ ఉద్యోగులతోపాటు వాలంటీర్లూ, పంచాయతీల పర్యవేక్షణ, నియంత్రణలో సేవలందిస్తారని మొదట్లో ప్రకటించిన వైఎస్సార్సీపీ సర్కార్ 2021 ఫిబ్రవరిలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాక ప్లేటు తిప్పేసింది. సచివాలయాలపై సర్పంచుల పర్యవేక్షణ, నియంత్రణను తొలగించింది. సచివాలయాల పర్యవేక్షణకు కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖను సృష్టించింది. ఆ తర్వాత ఉద్యోగులు సర్పంచులను లెక్కేచేయడం లేదు. కనీసం వాలంటీర్లకు ఇచ్చే విలువా ఇవ్వడం లేదు.
"పంచాయతీ సర్పంచ్ కన్నా వాలంటీర్‌కు విలువ ఎక్కువ ఉంది. పంచాయతీ వ్యవస్థకు సమాంతరంగా వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చారు. రాజ్యంగబద్ధమైన ఎన్నికైనా మాకు ఇవ్వాల్సిన నిధలు, విధులను వాలంటీర్లకు ఇస్తున్నారు." -సర్పంచ్
ఇక పంచాయతీల ఖాతాలను ఖాళీచేసి పల్లెల అభివృద్ధికి పాతరేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. పంచాయతీల తీర్మానం లేకుండానే విద్యుత్ ఛార్జీల బకాయిల పేరుతో కేంద్ర ఆర్థిక సంఘం నిధులను లాగేసుకుంది. ఈ విధంగా గత రెండేళ్లలో దాదాపు 12 వందల 45 కోట్ల రూపాయలు మళ్లించింది. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 2022-23 సంవత్సరానికి తొలి విడతగా కేంద్రం కేటాయించిన రూ.988 కోట్లును రాష్ట్ర ప్రభుత్వం తన వద్దే పెట్టుకుంది. ఆ నిధులను పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో వేయాలంటూ ఈనెల 3న పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన సర్పంచులపై పోలీసులతో దాడి చేయించారు.
నిధుల మళ్లింపుపై కేంద్రం ఆగ్రహించడంతో పంచాయతీల బ్యాంకు ఖాతాలకే డబ్బు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది. కానీ.. నేటికీ అలా చేయలేదు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రెండో విడత నిధులు విడుదల చేయకుండా పెండింగ్‌లో పెట్టింది. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు కేటాయించకపోవడం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో చేపట్టే కొత్త పనులకు అనుమతులివ్వని కారణంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.
ప్రస్తుత ప్రభుత్వం వచ్చి కొత్తలో ప్రత్యేక అధికారుల ఆమోదంతో గ్రామాల్లో దాదాపు రూ.9 వేల కోట్లతో 35వేలకుపైగా సచివాలయాలు, రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాలు తదితర భవన నిర్మాణాలు ప్రారంభించారు. వాటిలో చాలావాటినికి నేటికీ బిల్లులివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీ వాటా కింద.400 కోట్లకుపైగా ఈ ఏడాది జనవరి నుంచి విడుదల చేయాల్సి ఉంది. వృత్తి పన్ను, తలసరి ఆదాయం, సీనరేజి నిధులు విడుదల చేయలేదు. అలా పంచాయతీలపై అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.