YCP General Meeting at Tadepalli Camp Office: అసెంబ్లీ సమావేశాలు ముగియగానే గేర్ మార్చాలని వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. "వైనాట్ 175”(Whynot 175) అంటూనే ఇన్నాళ్లూ చేసింది ఒకఎత్తు అయితే, వచ్చే ఆర్నెల్లు మరో ఎత్తని అన్నారు. వైసీపీని ఒంటరిగా ఎదుర్కోలేక ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోవచ్చన్న జగన్ కుటుంబసభ్యుల్లా తన నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. ‘ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి’, 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమాల్ని వచ్చే 2 నెలలూ ఉద్ధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు. దళిత డ్రైవర్‌ని హత్యచేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు సీఎం సమావేశానికి రావడం చర్చనీయాంశమైంది.
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇంఛార్జులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో సీఎం జగన్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయని మర్నాటినుంచే ఎన్నికల కోసం పార్టీ గేర్ మార్చాలని స్పష్టంచేశారు. నాలుగున్నరేళ్లు చేసింది ఒకెత్తయితే, వచ్చే ఆర్నెల్లు మరో ఎత్తని అందుకే రాబోయే రెండు నెలలు జనంలోనే ఉండాలని నిర్దేశించారు. మండల, గ్రామస్థాయి నాయకులతో విభేదాలను వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలుపు సాధ్యమేనన్న సీఎం అందుకే ప్రతిపక్షాలు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని విమర్శించారు. నియోజకవర్గ సర్వేలు చివరికొచ్చాయని ప్రస్తుత ఎమ్మెల్యేలలో చాలామందికి మళ్లీ టికెట్లు ఇవ్వగలిగినా, కొందరికి మాత్రం ఇవ్వలేకపోవచ్చని స్పష్టంచేశారు.
CM Review meeting: క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు విడుదల చేయాలి: సీఎం జగన్
‘ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి ’ అనే కార్యక్రమాన్ని ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు సీఎం నిర్వహించిన సమావేశంలో ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ తెలిపారు. ప్రభుత్వ పరంగా చేపట్టే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ గురించి కూడా ఆయనే వివరించారు. మధ్యమధ్యలో కొన్ని అంశాలను సీఎం ప్రస్తావించారు. ప్రభుత్వ పరంగా ఈ రెండు కార్యక్రమాలు ఎంతో ముఖ్యమన్న జగన్ 2 నెలల పాటు ఉద్ధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వాలంటీర్లు, గృహ సారథులను భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వంతో పాటే ఇవీ కొనసాగించాలన్నారు. నవంబర్ చివరికి గడపగడపకు ముగించి ఆ తర్వాత ఎన్నికల కార్యాచరణ మొదలెడతామని చెప్పారు.
Anil Kumar Yadav Met CM Jagan: సీఎం చెంతకు నెల్లూరు సిటీ పంచాయితీ.. సమస్య పరిష్కారమయ్యేనా..!
దళిత డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లి బెయిల్‌పై ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు సీఎం నిర్వహించిన సమావేశానికి రావడం చర్చనీయాంశంగా మారింది. హత్య జరిగిన 6 రోజులకు అనంతబాబును వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. అయినా ఇప్పుడు సీఎం వద్ద సమావేశానికి ఎలా వస్తారని నేతలే చర్చించుకోవడం కనిపించింది. సాధారణంగా సీఎంవోలోకి వెళ్లడం అంత సులభం కాదు. అనంతబాబు మాత్రం దర్జాగా వెళ్లి సీఎం సమావేశంలోనూ పాల్గొన్నారు. గత నెల కూనవరం వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లినప్పుడు ఏర్పాటుచేసిన సమావేశంలోనూ సీఎంతోపాటు వేదికపై అనంతబాబు ఉన్నారు.
ఈ సమావేశంలో చంద్రబాబు అరెస్టు(Chandrababu arrest) గురించి చర్చించలేదన్న మంత్రి అమర్‌నాథ్ అది తమ పార్టీకి సంబంధించిన అంశం కాదన్నారు. దర్యాప్తు సంస్థలు ఆ విషయం చూసుకుంటాయని అన్నారు. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రపతిని కాకపోతే అమెరికా అధ్యక్షుడిని కలవమని లోకేశ్‌కు చెప్పాలని వ్యాఖ్యానించారు. ఒక కేసులో ఏ-12గానో 13గానో చేర్చినందున లోకేశ్‌ను కూడా అరెస్టు చేసే పరిస్థితి కనిపిస్తోందని అమర్‌నాథ్ చెప్పారు.