ఇదేంటి... ఇంటిపైకి లారీ, కారు, జేసీబీ ఎలా ఎక్కాయో అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు పొరబడినట్లే. అవి నిజమైనవి కాదండోయ్. అవన్నీ ఇంటిపై తీర్చిదిద్దిన నీటిట్యాంకులు. గుంటూరు జిల్లా కొల్లూరులో ఏ మూల చూసినా భవనాలపై ఏదో రూపం మనకు తారసపడుతుంటోంది. లారీ, ట్రాక్టర్, జేసీబీ, కోడిపుంజు, కారు, గ్యాస్ సిలిండర్, ఆలయ గోపుర శిఖరం... ఇలా విభిన్న రూపాల్లో నీటిట్యాంకులు కనిపిస్తాయి. అది అవసరాల కోసమో... అందం కోసమో నిర్మించుకున్నవి కాదు...వాటితో వారికి ఉన్న అనుబంధం, ప్రేమ, మమకారమే అలా నిర్మించేలా చేసింది.
మూలాలు మర్చిపోకుండా...
డ్రైవర్‌గా వృత్తి జీవితం ప్రారంభించిన వ్యక్తి... లారీపై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఇంటిపై లారీ ఆకారంలో వాటర్ ట్యాంక్ నిర్మించి మరుపురాని గుర్తుగా మార్చుకున్నారు. పొలంలో ట్రాక్టర్ తోనే ఆరుగాలం పనిచేసి దానితో అనుబంధం ఏర్పరుచుకున్న మరో వ్యక్తి ట్రాక్టరును, కోళ్ల పెంపకం ద్వారా ఉన్నతస్థాయికి చేరిన మరొకరు కోడిపుంజు ఆకారంలో వాటర్ ట్యాంకును నిర్మించుకున్నారు. జేసీబీ ద్వారా ఓ స్థాయికి ఎదిగిన మరొకతను.. తన ఇంటిపైనే జేసీబీ రూపాన్ని నీటిట్యాంకు రూపంలో ఆవిష్కరించారు. ఇలా ఎంత ఎదిగినా తమ మూలాలు మర్చిపోకుండా.. గతంలో చేసిన వృత్తి పట్ల గౌరవం, ప్రేమను ఘనంగా చాటుతున్నారీ యజమానులు.
ఆత్మసంతృప్తే ముఖ్యం...
చేత్తో ఓ చిత్రాన్ని గీయడమే కష్టం. అలాంటిది వీరి అభిరుచులకు తగ్గట్లుగా ఆయా నిర్మాణాలను ప్రతిష్ఠించడం కాస్త ఖర్చుతో కూడిన వ్యవహారమే. అలాగే వాటిని నిర్మించే వారు సైతం అరుదుగా ఉంటారు. నిర్వహణ కూడా అంత సులువు కాదు. కానీ ఇవన్నీ తమకు సమస్యలు కాదని.... వాటిపై అభిమానం.. అంతకుమించిన ఆత్మసంతృప్తి ముఖ్యమంటున్నారు ఇంటి యజమానులు.
ఇవీ చదవండి:
'అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు'
జుత్తాడలో తీవ్ర ఉద్రిక్తత.. హోంమంత్రి, కలెక్టర్ రావాలంటున్న మృతుల బంధువులు