Water shortage in Krishna Western Delta: అప్పులు, ఆపై అడుగడుగునా సవాళ్లే తప్పా.. వారికి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. అయినా... సాగుతో పోరాటం చేస్తూ పైరును రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు డెల్టా రైతులు.. కానీ, పచ్చని వరి పైరుకు.. నీరందక కళ్ల ముందే నేల చూపులు చూస్తుంటే తట్టుకోలేకపోయారు. సాగునీరు విడుదల చేయాలని రోడ్డెక్కి ఆందోళన చేశారు. అధికారులు అరకొరగా విడుదల చేసిన నీటిని... మోటర్ల సాయంతో పొలాలకు తరలించేందుకు నానా తంటాలు పడుతున్నారు.
500 ఎకరాలకు మాత్రమే నీరు: ఏడాదికి మూడు పంటలతో పచ్చగా కళకళలాడే గుంటూరు జిల్లాలోని వ్యవసాయ భూములు.. నేడు తీవ్ర నీటి ఎద్దడి కారణంగా బీటలు వారడంతో... అన్నదాతలు కలవరపడుతున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగు నీరందక ఆందోళన చెందుతున్నారు. తెనాలి మండలంలోని కొలకలూరు రెవిన్యూ గ్రామ పరిధిలో 6 వేల ఎకరాలు సాగులో ఉంది. వీటిలో కేవలం 500 ఎకరాలకు మాత్రమే నీటి సౌలభ్యం ఉంది. మిగిలిన పొలాలకు కాలువల నుంచి వచ్చే నీరే దిక్కు. ప్రకాశం బ్యారేజీలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో కాలువలకు అరకొరగానే విడుదల చేస్తున్నారు. పూడిక సమస్యలతో వచ్చే కొద్దిపాటి నీటికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. కాలువ సమీపంలోని రైతులు నీరు మళ్లించుకోవడంతో... దిగువ పొలాలకు నీరు అందడం లేదు. దీంతో వరి ఎదిగే పరిస్థితి కానరాక రైతులు ఆవేదన చెందుతున్నారు.
Farmer Crying Due to Dying Crops in AP: నీరందక ఎండిన పంట.. కన్నీరుమున్నీరైన రైతు..
కిలోమీటర్ల కొద్దీ పైపులు: మూడు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నా... డెల్టా ప్రాంతంలో ఎన్నడూ ఈ స్థాయిలో నీటి ఎద్దడి చూడలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంటను కాపాడుకునేందుకు కిలోమీటర్ల కొద్దీ పైపులు వేసి ప్రయత్నించినా.. నీరందే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. పంటకు నీరందించేందుకు రాత్రింబవళ్లు శ్రమించినా... చుక్క నీరు రావడం లేదని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వానికి వ్యవసాయం, నీటిపారుదల రంగంపై అవగాహన లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ డెల్టా పరిధిలో 4.61 లక్షల ఎకరాల్లో వరి సాగు: అధికారులు సకాలంలో నీటిని విడుదల చేసి ఉంటే నేడు రైతులకు ఈ దుస్థితి ఉండేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 4.61 లక్షల ఎకరాల్లో రైతుల వరి సాగు చేశారు. ప్రస్తుతం పంట వివిధ దశల్లో ఉంది. ఈ సమయంలో నీటి అవసరం తప్పనిసరని రైతులు స్పష్టం చేస్తున్నారు. పక్కనే ప్రకాశం బ్యారేజీ ఉన్నా... పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీరు తెచ్చుకునే అవకాశం కనిపిస్తున్నా.. సాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.