Voter List Amendment Campaign in AP: ఓటర్ల జాబితాలు ఎలా ఉండకూడదన్న అంశంపై ఎవరైనా పీహెచ్‌డీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌కి మించిన ఉదాహరణ ఉండదనేలా రాష్ట్రంలో పరిస్థితి తయారైంది. ఎన్ని రకాల అవకతవకలకు ఆస్కారముందో అన్ని అవకతవకలు.. ఏపీ ఓటర్ల జాబితాలో ఉన్నాయి. లోపాల్ని సరిచేయడానికే నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్‌లో కీలకంగా వ్యవహరించాల్సిన బీఎల్వోలు తొలిరోజు వందల సంఖ్యలో గైర్హాజరవడం.. హాజరైన చోట్ల ఒకటి రెండు గంటలే ఉండటం వంటి పరిస్థితులు కనిపించాయి. మరణించినవారి పేర్లు జాబితాల్లో కొనసాగడం, ఖాళీ స్థలాల పేర్లతోనూ ఓట్లు.. శాశ్వతంగా వలసపోయినవారి పేర్లూ ఉండడం వంటి ఘోరాలు ఈనాడు - ఈటీవీ భారత్ పరిశీలనలో బయటపడ్డాయి.
ఓటరు జాబితాలో సవరణ కోసం ఎన్నికల సంఘం నిర్వహించిన.. పరిశీలన కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. ఈ కార్యక్రమం రెండు రోజులు నిర్వహిస్తుండగా.. అందులో భాగంగా మొదటి రోజైన శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలింగ్ కేంద్రాలను ఈటీవీ భారత్ - ఈనాడు బృందాలు సందర్శించాయి.
ముసాయిదా ఓటర్ల జాబితాల్లో ఆసక్తికర విషయాలు మార్పులు చేయకుండానే
ఓటరు జాబితాను గేటుకు కట్టేసిన వైనం: గుంటూరు బీఆర్ స్టేడియంలో ముసాయిదా ఓటరు జాబితాను గేటుకు కట్టేసి వెళ్లిపోవడం లెక్కలేనితనానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఓటరు జాబితా సవరణపై సరైన ప్రచారం చేయకపోవడం వల్ల చాలామందికి తెలియలేదు. ఫలితంగా బాపట్ల జిల్లాలో చాలచోట్ల బీఎల్వోలులు ఖాళీగా కూర్చుని వెళ్లిపోయారు.
జాబితా బల్లపైన పెట్టి తాపీగా ఎవరి పనిలో వారు : బాపట్ల మున్సిపల్ హైస్కూలో మధ్య్నాహం తర్వాత బీఎల్వోలు వెళ్లిపోయారు. వేటపాలెం మండలం అక్కాయిపాలెం 166, 167 పోలింగ్ స్టేషన్లలో ఓటరు జాబితాను అక్కడున్న బల్లపైన పెట్టేసి బీఎల్వోలు తమపని తాము చూసుకున్నారు. పల్నాడు జిల్లా రావిపాడు గ్రామంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో ఒక్క బీఎల్వో కూడా కనిపించలేదు. తప్పొప్పుల సవరణ (Voter list Correction) కోసం వచ్చిన జనం ఆగ్రహం వెలిబుచ్చారు.
ఏర్పాట్ల కొరత: బీఎల్వోల విధుల నిర్వహణకు చాలా చోట్ల ఏర్పాట్లు చేయకపోవడమూ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. పోరంకి జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థుల మధ్యే విధులు నిర్వర్తించారు. ఫలితంగా పిల్లలు.. సవరణ దరఖాస్తులివ్వడానికి వెళ్లిన ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇక గన్నవరంలో కొన్నిచోట్ల బీఎల్వోలు చెట్ల కింద కూర్చుని దరఖాస్తులు పరిశీలించి మమ అనిపించారు.
నామమాత్రపు స్పందన: గుడివాడలో బీఎల్వోలు ఆలస్యంగా రావడంతో నామమాత్రపు స్పందన వచ్చింది. ఇక నెల్లూరులో అనేక చోట్ల ఉదయం 11గంటల వరకూ అందుబాటులోకి రాలేదు. కందుకూరు మండలం ఓగూరు పోలింగ్ కేంద్రం వద్ద మధ్యాహ్నం 12.30 గంటల వరకూ బీఎల్వోల జాడేలేదు. నెల్లూరు ఆర్ఎస్ఆర్ స్కూల్‌లో సిబ్బందికి కనీస వసతులే కల్పించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సిమెంట్ బల్లలపైనే కూర్చుని మమ అనిపించారు.
63 స్థానాల్లో అంతమంది ఓటర్లా?.. అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు
పత్తాలేని బీఎల్వోలు : తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఊట్లపల్లి పోలింగ్ స్టేషన్ వద్ద.. ఉదయం కాసేపు మాత్రమే బీఎల్వోలు అందుబాటులో ఉండగా నిడిగల్లులో మధ్యాహ్నం వరకూ పత్తాలేరు. చిత్తూరు జిల్లా ఎన్ కొత్తపల్లిలోని 205 నంబర్ పోలింగ్‌కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలకూ బీఎల్వో హాజరుకాలేదు.
తెరుచుకోని పోలింగ్ కేంద్రాల తలుపులు : పుంగనూరు 46వ నంబరు పోలింగ్ స్టేషన్‌లోనూ బీఎల్వో లేరు. కాకినాడలోని సంతానపురి కాలనీ 8, 9 పోలింగ్ కేంద్రాల తలుపులు ఉదయం 11 వరకు తీయలేదు. బీఎల్వోలు బయటే నిరీక్షించాల్సి వచ్చింది. కాకినాడలో చాలా వరకూ తప్పులేవీ సవరించలేదనే ఫిర్యాదులందాయి.
రాష్ట్రంలో 3.98 కోట్ల మంది ఓటర్లు.. 10 లక్షలకు పైగా ఓటర్లు తొలగింపు
మెరుపుతీగల్లా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పెద్దపేటలో ఓటరు జాబితా సవరణ కేంద్రాలు మూతపడి కనిపించాయి. బీఎల్వోలు ఆచూకీ లేదు. కొన్నిచోట్ల ఇలా వచ్చి అలా వెళ్లిపోయారనే విమర్శలున్నాయి. మాకివలసలో 114 ఓట్లు తొలగించేందుకు.. వైసీపీ నాయకులు ఫారం-7 దరఖాస్తు పెట్టగా అవన్నీ పరిశీలించినవారే లేరని ఆరోపిస్తున్నారు.
ముసాయిదా ఓటర్ల జాబితా లేనేలేదు : విజయనగరంలోని 30, 31, 32, 33 పోలింగ్ స్టేషన్ల పరిధిలో నలుగురు బీఎల్వోలకు ఒక్కరు మాత్రమే 10 గంటల 45 నిమిషాలకు విధులకు వచ్చారు. ఓటర్ల ముసాయిదా జాబితాలే ప్రదర్శించలేదు. భోగాపురం మండలం చాకివలసలో.. చనిపోయినవారి ఓట్లు ఎందుకు తొలగించలేదని బీఎల్వోలను నిలదీశారు.
కొన్నిచోట్ల ముసాయిదా ఓటర్ల జాబితాలు లేక పాత జాబితాలతోనే పని కానిచ్చారు. కొన్నిచోట్ల బీఎల్వోలు కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తు ఫారాలు ఇవ్వకుండా.. యాప్‌లో నేరుగా నమోదు చేశారు. అనకాపల్లిలోని 163వ పోలింగ్ కేంద్రంలో సర్వర్ సమస్య రావడంతో ఓట్ల నమోదుకు వచ్చినవారి నుంచి ధ్రువపత్రాల నకళ్లు తీసుకుని వెనక్కి పంపించేశారు.
35 మంది ఓటర్ల కోసం అధికారుల సాహసం.. నదులు, కొండలు దాటెళ్లి పోలింగ్‌కు ఏర్పాట్లు
విధులను వదిలి గడప గడపలో బీఎల్వో : కొన్ని చోట్ల బీఎల్వోలు ఎన్నికల విధుల కంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సేవలో తరించేందుకే ప్రాధాన్యమిచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు నిర్వహించిన ‘గడపగడపకూ- మన ప్రభుత్వం’ కార్యక్రమానికి బీఎల్వో హాజరై.. ఎన్నికల విధులకు డుమ్మా కొట్టారు.
కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి : మరోవైపు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోర్టు ఆదేశించినా లెక్క చేయడం లేదు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలోనూ చాలామంది అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు గ్రామీణ మండలం అనంతగిరిలోని 145వ పోలింగ్ కేంద్రంలో బీఎల్వోలతోపాటు ఇద్దరు వాలంటీర్లు ప్రక్రియలో పాల్గొన్నారు.
అవకతవకలకు చోటు : నెల రోజులపాటు నిర్వహించిన ఇంటింటి సర్వేలో గుర్తించిన లోపాలేవీ.. ఎన్నికల సంఘ అధికారులు పెద్దగా పరిష్కరించలేదు. మృతుల పేర్లు జాబితాలో కొనసాగించడం.. ఒక ఇంటి నంబరుతో పెద్ద సంఖ్యలో ఓట్లు ఉండటం, దరఖాస్తు చేసుకున్నవారి పేర్లు జాబితాల్లో లేకపోవడం, భర్త పేరు ఉండి భార్య పేరు లేకపోవడం లాంటి అవకతవకలు చాలాచోట్ల బయటపడ్డాయి.