Volunteers involved Special Comprehensive Amendment of Electoral Roll: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024 శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇంటింటి తనిఖీల్లో రాష్ట్రంలోని పలు చోట్ల బూత్ స్థాయి అధికారులతోపాటు వాలంటీర్లూ పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధుల్లోనూ వాలంటీర్లను భాగస్వాముల్ని చేయవద్దంటూ ఇప్పటికే పలుమార్లు మార్గదర్శకాలు జారీ చేశామని ఎన్నికల సంఘం చెప్తోంది. ఇంటింటి తనిఖీలకూ వారిని దూరంగా ఉంచుతామని పదే పదే చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం చాలా చోట్ల ఎన్నికల సంఘం నిబంధనలేమి అమలు కావడం లేదు.
శుక్రవారం నిర్వహణ కార్యక్రమంలో వాలంటీర్లే స్వయంగా.. ఓటర్ల జాబితాను పట్టుకుని బూత్ స్థాయి అధికారులతో కలిసి ఇంటింటికీ తిరిగారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి, విశాఖపట్నం జిల్లా పొడుగుపాలెం, డా.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం కూనవరం సహా పలు ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే కనిపించింది. టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల ఓట్లు వారికి తెలియకుండానే తొలిగించడంతో పాటు అధికార వైసీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించడంలో వాలంటీర్లే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఇప్పటికే అనేక ఫిర్యాదులున్నాయి. పలు నియోజకవర్గాల్లో పలు అవకతవకలు ఇప్పటికే వెలుగుచూశాయి.
ఈ నేపథ్యంలో ఇంటింటి తనిఖీ ప్రక్రియ దరిదాపుల్లోకి.. వాలంటీర్లను రానీయకుండా చూడాల్సిన బూత్ స్థాయి అధికారులే తమతో పాటు వారిని పరిశీలనకు తీసుకెళ్లడం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వాలంటీర్లు బీఎల్‌వోలతో కలిసి ఇంటింటి తనిఖీల్లో పాల్గొంటుంటే ఓటర్ల జాబితా ప్రక్షాళన సాధ్యపడుతుందా అనే సందేహలున్నాయి. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లు ఏం చేస్తున్నట్లు? ఇంటింటి తనిఖీల్లో పాల్గొన్న వాలంటీర్లు, వారిని తమతో పాటు వచ్చేందుకు అనుమతించిన బూత్ స్థాయి అధికారులపై వెనువెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇదేనా ఎన్నికల సంఘం చిత్తశుద్ధి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
విశాఖ జిల్లా ఆనందపురం పంచాయతీ సచివాలయం పరిధిలోని పొడుగుపాలెం గ్రామంలో బీఎల్‌వో రమ్య.. వాలంటీరు శ్రావణితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు తనిఖీ చేశారు. గాజువాక నియోజకవర్గం 40వ వార్డు ఏకేసీ కాలనీలో నిర్వహించిన ఓట్ల తనిఖీలో బీఎల్‌వో రాజాబాబుతో కలిసి వాలంటీరు మహేష్ పాల్గొన్నారు. వైసీపీ నాయకుల కనుసన్నల్లో ఈ తనిఖీ ప్రక్రియ జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు, ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులకు ఈసీ అధికారులు కనీస సమాచారం అందించలేదు.
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం కొటాల గ్రామంలో నిర్వహించిన ఇంటింటి తనిఖీల్లో వాలంటీరు పి.సహదేవ పాల్గొన్నారు. 179వ పోలింగ్ కేంద్ర పరిధిలో బీఎల్వో మణికంఠతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత గ్రామంలో ఓ చోట కూర్చొని ఓటర్లను అక్కడికి పిలిపించుకుని.. బీఎల్‌వోతో పాటు వాలంటీరు వారి వివరాలు పరిశీలించారు.
కలికిరి ఇందిరమ్మకాలనీలో జరిగిన ఓటర్ల తనిఖీ కార్యక్రమంలో బీఎల్‌వో శ్రీనివాసులతో కలిసి వాలంటీరు మంజూర్ వలీ పాల్గొన్నారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపినా అధికారులు పట్టించుకోలేదు. కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని విద్యానగర్‌లో బీఎల్‌వో రామకృష్ణతో కలిసి ఆ ప్రాంత వాలంటీర్ రఫీ ఓటర్ల తనిఖీలో పాల్గొన్నారు. బీఎల్‌వోతో కలిసి ఇంటింటికీ తిరిగారు.