కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి... మరణాల శాతాన్ని తగ్గించడానికి కేంద్రప్రభుత్వం పీఎం కేర్ కింద బోధనాస్పత్రులు, కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రులకు వెంటిలేటర్లను సరఫరా చేసింది. వాటిని అమర్చి బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాల్సిన జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు ఎందుకో నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రితోపాటు తెనాలి, నరసరావుపేట ప్రాంతీయ వైద్యశాలలకు కలిపి 310 వెంటిలేటర్లను కేంద్రప్రభుత్వం సమకూర్చింది. రోజుల తరబడి వాటిని అమర్చకుండా వదిలేయడం అధికారుల నిర్లక్ష్యాన్ని, నిర్లిప్తతను చెప్పకనే చెబుతోంది. కొన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్లు లేక రోగులను తిప్పి పంపిస్తున్నారు.
కొందరైతే వెంటిలేటర్ల సదుపాయమున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకుంటున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో కరోనా బాధితులకు ఉచితంగా ప్రాణవాయువును అందించే సంజీవని లాంటి వెంటిలేటర్లను వైద్యారోగ్య శాఖ అధికారులు ఎవరికీ పట్టనివిధంగా గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వీటిని అమర్చడానికి అవసరమైన సాంకేతిక నిపుణులు, అనష్థీషియన్లను గతంలో నియామకం చేసుకున్నారు. ప్రస్తుతం మూడు షిప్టుల్లో సిబ్బంది ఉన్నా వెంటిలేటర్లను అమర్చకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.
గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మరణాలు సైతం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో ఎక్కడి నుంచైనా... వెంటిలేటర్లు అవసరమైన రోగులను జీజీహెచ్ కు పంపిస్తున్నారు. అక్కడి రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో సకాలంలో వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అనేకమంది రోగులను గుంటూరుకు పంపుతున్నారు. తెనాలి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అదే పరిస్థితి. ప్రస్తుతం జిల్లాలో 360 ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు కలిగిన బెడ్లు 250, ఆక్సిజన్ పడకలు 1964, నాన్ ఐసీయూ పడకలు 1437 వరకు ఉన్నాయి.
కరోనా అవసరాల రీత్యా మరో 20 కేఎల్ ప్లాంటును అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జీజీహెచ్ లో ఆరుబయటే ఉన్న వెంటిలేటర్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. వెంటిలేటర్ల అమర్చని వైనంపై మీడియాతో మాట్లాడేందుకు అక్కడి అధికారులు విముఖత చూపిస్తున్నారు. సాంకేతిక కారణాలు సాకుగా చూపించడం మాని... కరోనా రోగులకు ప్రాణాధారమైన వెంటిలేటర్లను తక్షణమే మూడు ప్రభుత్వాస్పత్రుల్లో అమర్చాలని కరోనా బాధితులు, వారి బంధువులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: