Balayya fans go frenzy in theatre: నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' సినిమా విడుదల సందర్భంగా నందమూరి అభిమానులు సందడి చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. తెల్లవారుజామునే థియేటర్ల వద్ద బాణసంచా, డప్పులు, డ్యాన్స్‌లతో సందడి చేశారు. సినిమాలో బాలయ్య డైలాగ్స్, ఫైట్స్, సెంటిమెంట్, పాటలు అద్భుతంగా ఉన్నాయని విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ చిత్రం వీరసింహారెడ్డికి అన్నివర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామునే బెనిఫిట్ షోలు వేయడంతో.. థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీరారు. కొబ్బరికాయలు కొట్టి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అమెరికా నుంచి అమలాపురం వరకూ థియేటర్లలన్నీ జై బాలయ్య నినాదాలతో మార్మోగాయి.
సత్యసాయి జిల్లా: హిందూపురంలో వీరసింహారెడ్డి విడుదలతో పండుగ వాతావరణం నెలకొంది. సినిమా బ్లాక్‌బాస్టర్ అంటూ అభిమానులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. బాలయ్య నటన అద్భుతమని కర్నూలులో బాలకృష్ణ అభిమానులు థియేటర్ల ముందు డ్యాన్స్‌లు చేశారు. తిరుపతిలోని అన్ని థియేటర్లలో బెనిఫిట్ షోలు వేయడంతో... జై బాలయ్య నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. సినిమా ఘనవిజయం సాధించిందంటూ సంబరాలు చేసుకున్నారు.
విజయవాడ: వీరసింహారెడ్డి చిత్రం విడుదలతో విజయవాడలో సందడి నెలకొంది. థియేటర్ల వద్ద తెలుగుదేశం నేతలు కేక్ కట్ చేసి విజయోత్సవాలు నిర్వహించారు. విదేశాల్లో బాలకృష్ణ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచిందని కేశినేని చిన్ని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వెలగలేరులో వీరసింహారెడ్డి ప్రచార ఫ్లెక్సీలపై మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫోటోలు ఉండటం స్థానికంగా చర్చకు దారితీసింది. నందిగామలోని విజయ టాకీస్‌లో టికెట్లు విక్రయించి ఉదయం 6 గంటలకే బెనిఫిట్ షో వేయకపోవడంతో అభిమానులు ఆందోళన చేశారు. అనుమతి లేని కారణంగా పోలీసులు అడ్డుకోవడంతో... గంట ఆలస్యంగా చిత్రాన్ని ప్రదర్శించడంతో అభిమానులు శాంతించారు.
విశాఖ: విశాఖలో వీరసింహారెడ్డి విడుదలతో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా పాడేరు వెంకటేశ్వర థియేటర్ వద్ద అభిమానులు హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణలోనూ ఇంటిల్లిపాది చూసే చక్కటి చిత్రమని ప్రేక్షకులు వీరసింహారెడ్డికి కితాబిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 'వీరసింహారెడ్డి' చిత్రాన్ని చూసేందుకు సుమారు 200 కార్లతో అభిమానులు థియేటర్ కు తరలివెళ్లారు. నందమూరి బాలకృష్ణ ఉదయాన్నే భ్రమరాంభ థియేటర్‌లో సినిమాను వీక్షించారు. కర్ణాటకలో ట్రాక్టర్లు, గుర్రపు బండ్లతో వీరసింహారెడ్డి థియేటర్ల వద్ద కోలాహలం అంబరాన్ని తాకింది.
అమెరికా: అమెరికా చార్లెట్ నగరంలో వీరసింహారెడ్డి విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులు వీరాభిమానం చాటారు. విదేశాల్లోనూ వీరసింహారెడ్డి గర్జన కొనసాగుతోంది. అమెరికాలోని ఓ థియేటర్‌లో అభిమానులు పెద్దఎత్తున పేపర్లు విసిరివేయడంతో... సినిమా ప్రదర్శన నిలిపేశారు. ఇప్పటివరకూ ఏ చిత్రానికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని యాజమాన్యం తెలిపింది. కేక్ కట్ చేసి సందడి చేశారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలూ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: