Suicides, Accidents And Murders: సంక్రాంతి పర్వదినం రోజున ఆనందం గడపాల్సిన వారు మాత్రం వాళ్ల ఆలోచనలతో వారి కుటుంబాలను విచారకరంగా మార్చారు. కొందరి జీవితాల్లో మాత్రం ఎవ్వరో తెలియని వ్యక్తులు చేసిన పొరపాట్లకు వారు కుటుంబాలు కుంగిపోయాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సీఐఎస్‌ఎఫ్ జవాను చింతామణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి చింతామణి మృతదేహాన్ని పోలీసులు తరలించారు. ఈనెల 10న శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో విధుల్లో జవాన్ చేరాడు.
భార్యను చంపి తాను ఆత్మహత్య: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకర్రులో దారుణం చోటు చేసుకుంది. భార్య రోజాను భర్త కొట్టి చంపాడు. అనంతరం తాను ఉరేసుకున్నాడు.
10 నెలల కుమార్తెను చంపిన తల్లి: అన్నమయ్య జిల్లాలో రాయచోటి మండలం నక్కలగుట్ట వద్ద అత్యంత దారుణం చోటు చేసుకుంది. 10 నెలల కుమార్తె (రుక్సానా)ను గొంతు నులిమి తల్లి (ఫాతిమా) చంపింది. తండ్రి (మహమ్మద్) బాషా ఫిర్యాదుతో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఫాతిమాకు అనారోగ్యం, మానసిక సమస్యలతో బాధపడుతుందని తెలుస్తోంది. తనకు ఏదైనా జరిగితే ఎవరూ చూసుకోలేరనే ఆందోళనతో కుమార్తెను చంపిందట. భర్త మహమ్మద్ బాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తనయుడిని హత్య చేసిన తండ్రి: ప్రకాశం జిల్లాలో చీమకుర్తి మండలం భూసరపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కుమారుడిని హత్య చేశాడు ఓ తండ్రి. తండ్రి బాబురావు కొడుకు జొన్నలగడ్డ సునీల్ తలపై రాయితో కొట్టడంతో చనిపోయాడు.
చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి: ఏలూరు జిల్లాలో పోలవరం మండలం గూటాల ఇసుక ర్యాంప్ సమీపంలో ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. విజయవాడ ఇబ్రహీంపట్నానికి చెందిన గరీబ్ నాయక్, హైదరాబాద్ నాచారం వాసి మసలి సందీప్‌రెడ్డి చనిపోయారని తెలుస్తుంది.
రెండు కార్లను ఢీకొట్టిన లారీ.. ఎనిమిది మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం: వైఎస్సార్ కడప జిల్లాలో ఒంటిమిట్ట వద్ద తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ రెండు కార్లను ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమం ఉంది. వారందరూ ఒకే కుటుబానికి చెందినవారు రెండు కార్లలో తిరుమల నుంచి పులివెందులకు వెళ్తున్నారు.
పిట్టగోడ కూలి నలుగురికి గాయాలు: కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభల తీర్థంలో ప్రమాదం జరిగింది. కొత్తరామాలయం వద్ద దేవస్థానంలో మ్యూజికల్ నైట్ చూస్తుండగా పిట్టగోడ కూలి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి