Tourism Places in Telangana State: పర్యాటకం.. ఈ రంగాన్నిఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పిన్నల నుంచి వృద్ధుల వరకు కొత్త ప్రాంతాలు, ప్రదేశాలకు తిరగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కొందరేమో అదే పనిగా తిరిగితే.. మరికొందరు ప్రత్యేక సందర్భాల్లో వాటిని దర్శిస్తూ ఉంటారు. ఒత్తిడి సమయాల్లో ఉపశమనం కోసం చాలా మంది విహార యాత్రలకు వెళుతుంటారు. ఏదేమైనా.. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి ఇవి మంచి స్ట్రెస్ బస్టర్స్(Stress Busters). అలాంటి పర్యాటక ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కక ఉన్నాయో (ఉమ్మడి జిల్లాల వారీగా) ఇప్పుడు చూద్దాం.
ఆదిలాబాద్ జిల్లా: తెలంగాణకు తల వంటిది ఈ జిల్లా. ప్రకృతి అందాలకు నెలవు. కుంటాల, (Kuntala Waterfalls), పొచ్చెర, మిట్టె జలపాతాలు మిమ్మల్ని పరవశంలో ముంచెత్తుతాయి. ఉట్నూర్ కోట, నాగోబా ఆలయం, కవ్వాల్ అభయారణ్యం, చదువుల తల్లి బాసర సరస్వతీ ఆలయం (Basara Temple), గాంధారి ఖిల్లా, శివ్వారం మొసళ్ల సంరక్షణ కేంద్రం, ఎల్లంపల్లి ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు గనులు.. చూడదగ్గ ప్రదేశాలు.
![బాసర సరస్వతీ ఆలయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17706090_fv.jpg)
కరీంనగర్: కోటలకు పెట్టింది పేరు కరీంనగర్ జిల్లా. అగ్గిపెట్టెలో పట్టేంత ఆరు గజాల చీరను నేసిన ఘనత కరీంనగర్ నేతన్న సొంతం. సిరిసిల్ల చేనేత కళా వైభవం, ఎలగందుల, జగిత్యాల, నగునూర్, మొలంగూర్, రామగిరి కోటలు కరీంనగర్ రాజసానికి ప్రతీకలు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, కాళేశ్వర ఆలయాలు ఆధ్యాత్మిక శోభకు నిలువుటద్దాలు. దిగువ మానేరు, రాజీవ్ గాంధీ జింకల పార్కులు ఆహ్లాదకర ప్రాంతాలు.
![వేములవాడ రాజన్న దేవాలయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17706090_vp.jpg)
నిజామాబాద్: జిల్లా ప్రజల దాహార్తిని తీర్చే శ్రీరామ్ సాగర్, అశోక్ సాగర్ ప్రాజెక్టులు, బోధన్ భీముని గుట్టలు, నిజామాబాద్, సిర్నపల్లి, దోమకొండ గడీలు, డిచ్పల్లి రామాలయం, ఆర్మూర్ సిద్ధుల గుట్ట, రఘునాథ ఆలయం, బడా పహాడ్ దర్గా.
![ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్ట](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17706090_pl.jpg)
మెదక్: మెదక్ కోట, సీఎస్ఐ మెదక్ క్యాథడ్రల్ చర్చ్, ఏడుపాయల దుర్గమ్మ ఆలయం, పోచారం రిజర్వాయర్ సరస్సు, పోచారం వన్య ప్రాణుల అభయారణ్యం, సింగూరు, మానేరు జలాయాలు.
![మెదక్ చర్చి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17706090_pm.jpg)
వరంగల్: ఈ జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదువ లేదు. కాకతీయుల రాజ్య చిహ్నాలు వేయి స్తంభాల గుడి, ఖిల్లా వరంగల్, కళా తోరణం, రామప్ప, భద్రకాళి, జనగామ త్రికుటాలయాలు, లక్నవరం చెరువు , పాకాల సరస్సు, బొగత జలపాతం కనువిందు చేస్తాయి.
![రామప్ప ఆలయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17706090_gh.jpg)
ఖమ్మం: ఖమ్మం అనగానే అందరికీ మదిలో మెదిలేది భద్రాచలం రామస్వామి ఆలయం. దీంతో పాటు పర్ణశాల, కిన్నెరసాని ప్రాజెక్టు, గోదావరి నదికి ఇరువైపులా ఉండే పాపికొండలు, ఖమ్మం కోట, లకారం, పలైర్ సరస్సులు ఖమ్మం జిల్లా సహజ సంపదలు.
![పాపికొండలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17706090_fw.jpg)
నల్గొండ: తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, కొలనుపాక జైనుల క్షేత్రం, చందంపేట, దేవరకొండ గుహలు, పోచంపల్లి చేనేత గ్రామం, భువనగిరి కోట, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కుందా సత్యనారాయణ కళాధామం, నందికొండ గ్రామం.
![యాదాద్రి దేవాలయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17706090_kuy.jpg)
రంగారెడ్డి: అనంతగిరి కొండలు (Anantha Giri hills), కోట్‌పల్లి జలాశయం, మౌంట్ ఒపేరా, ఓసియన్ పార్కు, రామోజీ ఫిల్మ్‌సిటీ, మృగవాణి జాతీయ పార్కు, సంఘీ, చిలుకూరు బాలాజీ ఆలయాలు.
![అనంతగిరి కొండలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17706090_at.jpg)
మహబూబ్‌నగర్: ఈ జిల్లా పేరు అనగానే మనకు పిల్లలమర్రి గుర్తొస్తుంది. జూరాల, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పీఠం జోగులాంబ గద్వాల, మల్లెల తీర్థం జలపాతం, గద్వాల కోట.
![జూరాల ప్రాజెక్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17706090_fee.jpg)
హైదరాబాద్: హైదరాబాద్‌లో పర్యాటక ప్రాంతాలు చూడటానికి ఒక్కరోజు సరిపోదు. చార్మినార్, హుస్సేన్ సాగర్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, చౌమహల్ల, ఫలక్‌నుమా ప్యాలెస్‌లు, కుతుబ్ షాహీ సమాధులు, నెహ్రూ జూ పార్కు, జలవిహార్, వండర్ లా, ఎన్టీఆర్ గార్డెన్స్, ప్రసాద్ ఐమ్యాక్స్, లుంబినీ పార్కు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
![చార్మినార్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17706090_char.jpg)
ఎలాగో సమ్మర్ వచ్చేస్తుంది. అందరికీ సెలవులు దొరుకుతాయి. ఇంకెందుకు ఆలస్యం.. కొంచెం ప్లాన్ చేసుకుని మీ కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో మీకు వీలున్నప్పుడు అలా సరదాగా ఈ ప్రాంతాలను చుట్టేసి రండి.
ఇవీ చదవండి: