Tobacco Farmers On Price : మన దేశంలో పొగాకు పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంతో కీలకం. దేశంలోని మిగతా రీజియన్లలో పోల్చితే మన వద్ద ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, పెరిగింది. గత ఏడాది మార్కెట్లో మంచి ధరలు లభించాయి. మేలు రకంతో పాటు మధ్య రకం, తక్కువ నాణ్యత గల పొగాకు సైతం మంచి ధర పలికింది. వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేయటంతో కిలో సగటు ధర రూ.172.49 లభించింది.
ఈ సారి అంతకంటే మంచి డిమాండ్ ఉంటుందని ముందుగానే భావించిన రైతులు పొగాకు సాగు వైపు మొగ్గుచూపారు. పొగాకు బోర్డు ఈసారి 57వేల 944 హెక్టార్ల విస్తీర్ణంలో సాగుకు అనుమతించింది. తద్వారా 87.11 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24,218 మంది రైతులు రిజస్ట్రేషన్ చేయించుకొని 30,383 బ్యారన్లు లైసెన్సులు రెన్యూవల్ చేయించుకున్నారు. బోర్డు అనుమతించినదాని కంటే కొంచెం ఎక్కువగానే పంట సాగయింది. 63 వేల 409 హెక్టార్లలో సాగయినట్లు అంచనా. ఈ ప్రకారం ఉత్పత్తి 101 మిలియన్ కిలోలు దాటనుంది. అయితే గతంతో పోల్చితే పొగాకు సాగుతో పాటు ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరిగాయి. కూలీలు, కట్టె ధరలతో పాటు పొలం కౌలు, బ్యారన్ అద్దెలు, నారు ఇతరత్రా ధరలు అధికమయ్యాయి. పైగా మాండౌస్ తుఫాన్‌తో తోటలు దెబ్బతిని రైతులు రెండోసారి నాటాల్సి వచ్చింది. దీంతో పెట్టుబడులు ఎక్కువయ్యాయి. ఈ సీజన్ లో ధరలు బాగుంటాయనే ఆశతో రైతులు అప్పులు తెచ్చి తిరిగి పంట సాగు చేశారు. వారం రోజుల క్రితం పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభమైంది. క్వింటా రూ.20వేలతో మొదలైంది. ధరలు మరింతగా పెరిగితేనే తమకు ఎంతో కొంత లాభాలు వస్తాయని రైతులు చెబుతున్నారు.
జులై, ఆగస్టు వరకూ పొగాకు అమ్మకాలు కొనసాగనున్నాయి. పొగాకును పండించేందుకు, ఆ తర్వాత ప్రాసెసింగ్ కోసం రైతులు పడే కష్టాలు అన్ని ఇన్నీ కావు. పొగాకు నారు పోసినప్పటి నుంచి ప్రతిదశలోనూ కూలీల అవసరం తప్పనిసరి. ఇందులో యంత్రాల వినియోగానికి తావులేదు. దీంతో కూలీ రేట్లు కూడా పెట్టుబడులపై ప్రభావం చూపిస్తున్నాయి. సరైన ధర రాకపోతే పెట్టుబడితో పాటు రైతుల శ్రమ కూడా వృథా అవుతుంది. లక్షల్లో పెట్టుబడి పెట్టి ఆరు నెలలు వెట్టి చాకిరీ చేస్తే... రైతుల శ్రమకు దగ్గ ఫలితం రాకపోవటంపై ఆవేదన చెందుతున్నారు. చాలామంది రైతులు లైసెన్సు రద్దవుతుందనే భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో పొగాకు సాగు చేస్తుంటారు.
పంట పండించిన తర్వాత గిట్టుబాటు ధర రాకపోతే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులు చెప్పిందే ధర అనే పరిస్థితిలో మార్పు రావాలంటున్నారు. గిట్టుబాటు ధర లభించకపోతే పొగాకు సాగును ఆపటానికి సిద్ధంగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. బ్యారన్ ఖర్చులు ఇప్పిస్తే వెంటనే వేరే పంటల సాగు చేస్తామంటున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఆకు నాణ్యత చాలా బాగుంది. కాబట్టి అన్ని రకాల గ్రేడ్ ధరల్ని కనీసం 30శాతం పెంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సీజన్ ప్రారంభంలో మాండౌస్ తుఫాన్‌తో పంట తీవ్రంగా దెబ్బతినింది. అయితే ప్రభుత్వం నుంచి గానీ, ఇటు పొగాకు బోర్డు నుంచి గానీ రైతులకు ఉపశమనం లభించలేదు. అందుకే పంట అధికంగా వేసిన రైతుల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించాలని కోరుతున్నారు. అధిక ఉత్పత్తిపై పెనాల్టీల రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: