పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 273వ రోజు కొనసాగింది. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి గ్రామాల్లోని రైతులు దీక్షా శిబిరాల వద్ద ఆందోళన చేశారు. ఉద్ధండరాయుని పాలెంలో రైతులు, మహిళలు మోకాళ్లపై కూర్సోని నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారంటూ చిల్లు గిన్నెలతో బోరుపాలెం మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు.
కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరులో దీక్షా శిబిరం వద్ద 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని మహిళలు, రైతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజధానిలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై అవినీతి నిరోధక శాఖ కేసులు నమోదు చేయడాన్ని రైతులు తప్పుపట్టారు. ప్రభుత్వం ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో రాజధానిలో అభివృద్ధి చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. కార్యనిర్వహక రాజధానిగా విశాఖను ప్రకటించిన తర్వాత అక్కడ జరిగిన భూలావాదేవీలపైనా సీబీఐతో విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని రైతులు ప్రశ్నించారు. న్యాయస్థానాల్లో తాము వేసిన కేసుల తేదీ దగ్గరకు వచ్చే ప్రతీసారి తప్పుడు కేసులతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోందని రైతులు ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చి 15నెలలు దాటినా ఇంతవరకు ఇన్ సైడ్ ట్రేడింగ్ కేసును ఎందుకు ఓ కొలిక్కి తీసుకరాలేకపోయారని రైతులు నిలదీశారు.
ఇదీ చూడండి. 'విశాఖలో దోచేసిన 30 వేల ఎకరాలపై సీబీఐ విచారణ జరగాలి'