THEFT IN GUNTUR: అతను ఆమెను నమ్మాడు.. వీళ్లిద్దరూ వాళ్లను నమ్మారు. వాళ్లు మాత్రం వీళ్లిద్దరిని ముంచేశారు. మేము ఐటీ అధికారులం.. మీ ఇంటిని సోదా చేయాలి. ఇలాంటి హడావుడి సినిమాల్లో కనిపిస్తుంది. అలా ఆమెను నమ్మించి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని, డబ్బును వారి బంధువుల సహాయంతో తెలివిగా కొట్టేశారు. లాఠీలు వారి లూఠీని 48 గంటల్లో ఛేదించారు. ఉన్నతాధికారుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఈ దొంగతనం సినిమా రెంజ్లో జరిగింది. ఈ ఘటన గుంటూరులో జరిగింది.
పాత గుంటూరు ప్రగతినగర్‌లో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. 48 గంటల్లో నిందితుల ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి 1.14 కోట్ల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీసు కార్యాలయంలో నిందితుల వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలియజేశారు. ప్రగతినగర్‌కు చెందిన శింగంశెట్టి కల్యాణి పదేళ్లుగా ప్రసాద్ అనే అతని ఇంట్లో నమ్మకస్తురాలుగా పని చేస్తోంది. కొద్ది కాలం క్రితం ప్రసాద్‌కు చెందిన ఆస్తులు అమ్మాడు. ఆ డబ్బును, బంగారాన్ని శింగంశెట్టి కల్యాణి ఇంట్లో భద్రంగా ఉంచాడు. కల్యాణి ఇంటికి గడ్డిపాడుకు చెందిన జ్యోతుల ఏసుబాబు, కాండ్రు జాన్‌బాబు వచ్చి పోతుంటారు. ఆమెతోపాటు ప్రసాద్‌తో కూడా వాళ్లు నమ్మకంగా కనిపించారు. ఇటీవల ఆస్తులు అమ్మడం, ఆ బంగారం డబ్బులు కల్యాణి ఇంట్లో భద్రపరిచిన విషయం జాన్‌బాబు, ఏసుబాబు బాగా తెలుసు. దానిని దోచెయ్యాలని భావించారు. ఈ క్రమంలో జాన్‌బాబు, ఏసుబాబులు తమకు తెలిసిన గడ్డిపాడుకు చెందిన బండ్లమూడి సురేష్, సంకూరు విజయ్‌కుమార్‌లతో కల్యాణి ఇంట్లో బంగారం, డబ్బులు దొంగతనం చేసి సమానంగా పంచుకుందామని చెప్పారు. అందుకు సురేష్ ఒప్పుకుని అతని బంధువులు, స్నేహితులైన అంకిరెడ్డిపాలేనికి చెందిన మేకతోటి రవీంద్రబాబు, కొచ్చెర్ల వెంకటస్వామిలతో కలసి దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఎంబీఏ చదువుకున్న సురేష్ ఓ ప్రైవేటు బ్యాంక్‌లో కలక్షన్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐటీ శాఖ అధికారులు ఎలా సోదాలు నిర్వహిస్తారో అవగాహన కలిగి ఉన్నాడు. దీనికి తోడు ఇటీవల ఓ సినిమాలల్లో హీరో తమ తెలివితేటలతో ఐటీ అధికారుల రూపంలో వెళ్లి దోపిడీ చేసిన ఉదంతం అతని మనసులో మెదిలింది. తాము కూడా అలా వెళ్లి దొంగతనం చేస్తే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయరని అనుకున్నాడు. సురేష్ ఒక కారు తీసుకొని నెంబర్ ప్లేట్ తీసేసి పోలీసు స్టిక్కర్ అంటించాడు. అతనితోపాటు సహాయంగా రవీంద్రబాబు, వెంకటస్వామిలను కారులో ఎక్కించుకున్నాడు. ఏసుబాబు, జాన్‌బాబు, విజయ్‌కుమార్‌లు ఆమెకు తెలిసిన వాళ్లు కావడంతో, ఆమె గుర్తు పడుతుందని వాళ్లు ఆటోలో ఇంటి వరకు వెళ్లి ఆమె నివాసాన్ని చూపించారు. రవీంద్రబాబు, సురేష్, వెంకటస్వామి ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులమని ఇంట్లోకి వెళ్లి బెదిరించి డబ్బు, బంగారం దోచుకుంటుండగా ఆటోలో ఉన్న ముగ్గురు ఇంటి చుట్టు పక్కల కాపలా కాశారు.
దొంగతనం చేసి పరారైన గంట తర్వాత కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 50 లక్షలు రూపాయల డబ్బు, 5 వందల గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారని పోలీసులకు చెప్పింది. ఈఘటనపై ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని అయిదు టీమ్‌లను రంగంలోకి దించారు. పోలీసులు రంగంలోకి దిగి విచారించగా.. నమ్మకంగా ఉన్న వారు చేసిన పనిగా గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దోచేసిన డబ్బు, బంగారం ఒక సూట్‌కేసులో పెట్టుకున్న ఓ నిందితుడు.. తన భార్యను వెంట పెట్టుకొని గుంటూరు, విజయవాడల్లో సంతోషంగా షికారు చేశాడు. ఈ క్రమంలో నిందితులందరూ పెదకాకాని వద్ద ఉన్నారనే సమాచారంతో పోలీసులు మాటు వేసి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 48.50 లక్షల రూపాయల నగదు, 66.30 లక్షల రూపాయల విలువ చేసే 1,326 గ్రాముల బంగారం వస్తువులను జప్తు చేశారు. బాధితురాలు బంగారం 5 వందల గ్రాములు మాత్రమే ఉందనుకొని ఫిర్యాదు చేయగా,.. కిలో 326 గ్రాములు ఉన్నట్లు పోలీసులు కనిపెట్టి స్వాధీనం పరుచుకున్నారు. మొత్తం 1.14 కోట్ల రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. 6 మంది ముఠాలో కొచ్చెర్ల వెంకటస్వామి పరారీలో ఉన్నాడని, అతని వద్ద గన్ ఉందన్నారు. అతన్ని పట్టుకుంటే గన్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం తేలుతుందన్నారు. అతి త్వరలో అతన్ని పట్టుకుంటామన్నారు.
ఇవీ చదవండి