CRDA amendment bill act రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా, చట్టబద్ధ హామీలను నెరవేర్చకుండా వారు ఇచ్చిన భూముల్లో అమరావతి ప్రాంతేతరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లస్థలాలు కేటాయిస్తోందని.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైతులిచ్చిన భూముల్లో ఇతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సరికాదంటూ హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని గుర్తుచేశారు. అవి అమల్లో ఉండగా, ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకోవడం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనన్నారు. ప్రభుత్వ చర్య కోర్టుధిక్కరణ కిందకు వస్తుందన్నారు. సీఆర్‌డీఏ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినా.. ఆ విషయాన్ని ప్రభుత్వం ప్రజాబాహుళ్యంలో ఉంచలేదన్నారు. ప్రభుత్వ నిర్ణయం చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉంటే జోక్యం చేసుకుంటామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సవరణ చట్ట ప్రతిని కోర్టు ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టంచేస్తూ విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. అంతకుముందు అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజధాని ప్రాంతంలోని వారికే కాకుండా రాష్ట్రంలో ఇతర ప్రాంత పేదలకు అమరావతిలో ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు తీసుకొచ్చిన సీఆర్‌డీఏ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారని, దీంతో యాక్ట్ 13 అమల్లోకి వచ్చిందన్నారు. ప్రస్తుత పిటిషన్లు నిరార్థకం అవుతాయన్నారు. రాజధాని ప్రతిఒక్కరిది కొంతమందికే ఇళ్లస్థలాలు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. సవరణ చట్టాన్ని కోర్టు ముందు ఉంచేందుకు సమయం కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. రైతుల నుంచి భూసమీకరణ పథకం కింద భూములు తీసుకొని మూడేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ విఫలమైనందుకు పరిహారం ఇవ్వాలని కోరుతూ.. పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ నవంబర్ 28కి వాయిదా పడింది.
ఇవి చదవండి: