Govt On R5 Zone: రాజధాని ప్రాంతంలో ఆర్ 5జోన్ లో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలంలో పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. హైకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆర్ 5జోన్ లో ఇళ్ల స్థలాల మార్కింగ్ చేపట్టారు. సుమారు 100 మంది సిబ్బంది కృష్ణాయపాలెంలోని 3 లే ఔట్లలో 9వేల ఇళ్ల స్థలాలకు మార్కింగ్, హద్దురాళ్లు పాతే పనులను ప్రారంభించారు. డీఆర్డీయే పీడీ హరిహరనాథ్ ఆధ్వర్యంలో సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది మార్కింగ్ పనుల్లో పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల్లోని ముళ్ల కంపను తగులబెట్టారు. పిచ్చి మొక్కలు తొలగించారు. 7 రోజుల్లో ఇళ్ల స్థలాల పనుల మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఈనెల 15లోపు లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు.
అమరావతి లోని ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ మంగళగిరి మండలం కృష్ణయపాలెంలో రైతులు నిరాహార దీక్షలు చేపట్టారు. రాజధాని ఐకాస జెండాను ఆవిష్కరించి.. తర్వాత రైతులు, మహిళలు నిరాహారదీక్షకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారమే పేదలకు భూములు కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆర్ -3 జోన్ లో 3 సెంట్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇల్లు నిర్మించుకుంటే సెట్ బ్యాక్ పేరుతో ఖాళీ స్థలం ఉండాలని అధికారులు నిబంధన పెట్టారు. అయితే దాని ప్రకారం పేదలకు ఇచ్చే సెంటు భూమిలో ఎలాంటి ప్లాన్ తయారు చేస్తారని నిలదీశారు. ఆర్ ఫై జోన్ రద్దయ్యేంతవరకు ఎన్ని రోజులైనా నిరాహార దీక్షలు కొనసాగిస్తామని రైతులను తేల్చి చెప్పారు.
ఆర్ 5 జోన్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అమరావతి రైతులు ధర్మాసనానికి వెళ్లారు. ఆర్ 5 జోన్‌లో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు సరికాదని పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని విన్నవించారు. అమరావతి మాస్టర్‌ప్లాన్‌కు దెబ్బతీసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. తమ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని... సోమవారం సుప్రీంకోర్టు ప్రారంభం కాగానే సీజేఐ ధర్మాసనాన్ని అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు కోరనున్నారు.
ఇల్లు లేని నిరుపేద రైతులకు ప్రభుత్వం ఎక్కడైతే ప్లాట్లు కేటాయించిందో అక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఆర్ 3 జోన్ లో 3500 ఎకరాల పై చిలుకు మిగులు భూమి ఉంది. ఆ భూమిలోనే పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి. అలా కాదని పేదలను మోసం చేసి కోర్టులో వివాదాలు ఉన్న భూములను పంచితే ఊరుకోము.-రైతులు
ఇవీ చదవండి: