గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపాన బోయంపాలెంలోని క్వారీగుంతలో గల్లంతైన నలుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. హోంమంత్రి సుచరిత వారి మృతికి సంతాపం తెలిపింది. బిళ్లా సాయి ప్రకాష్, సిద్ధంశెట్టి వెంకటేష్, లంబు వంశీ, ఈగుటూరి శంకర్, యశ్వంత్, హేమంత్ అనే ఆరుగురు స్నేహితులు. వీరంతా ప్రత్తిపాడుకు 10 కిలోమీటర్ల సమీపంలోని బోయపాలెం వద్ద కలుసుకున్నారు. వీరిలో కొందరు చదువుకుంటుండగా.. మరి కొందరు వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. సరదాగా గడుపుదామని డైట్ కళాశాల వెనుక ఉన్న క్వారీ గుంత వద్దకు వెళ్లారు. కాసేపు ఆడుకున్న తర్వాత కాళ్లు చేతులు కడుక్కుందామని క్వారీ గుంతలోకి దిగారు. యశ్వంత్, హేమంత్ ఒడ్డున కూర్చున్నారు. క్వారీ గుంత లోతుగా ఉండడం వల్ల....అందులోకి దిగిన నలుగురు ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న స్నేహితులు వారిని రక్షించేందుకు విఫలయత్నం చేశారు. తమ కళ్ల ముందే మిత్రులు నీట మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు.
యువకుల గల్లంతు విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలని ఎన్డీఆర్‌ఎఫ్ బృందం వెలికితీసింది. నలుగురు యువకుల గల్లంతుతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇదీ చూడండి. లారీలో ఆకస్మాత్తుగా మంటలు