Telugu Desam Party Election Campaign Programs: రాష్ట్రాన్ని చీకటిమయం చేసి ఆంధ్రప్రదేశ్‌ని ఆందోళనప్రదేశ్గా మార్చిన జగన్ పాలనకు చరమగీతం పాడదామంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'రా కదలి రా!' పేరిట ఎన్నికల ప్రచార పర్వాన్ని ఉరకలెత్తించనున్నారు. దీనికి సంబంధించి తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులైన సైకిల్ - గాజు గ్లాసులతో రూపొందించిన సరికొత్త లోగోను పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.
పంచాయతీ సమస్యలపై రేపు సర్పంచ్‌లతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనుండగా, బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన 'జయహో బీసీ' పేరిట రాష్ట్ర స్థాయి సదస్సుకు శ్రీకారం చుట్టారు. 5వ తేదీ నుంచి 29 వరకూ అన్ని పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 5వ తేదీన ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరి నుంచి బహిరంగ సభలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చేందుకు ఎంతోమంది సంపప్రదింపులు జరుపుతున్నారు. కొత్త, పాత వారి సమన్వయం కోసం ఓ కమిటీ ఇప్పటికే పనిచేస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప జగన్ పాలనలో అభివృద్ధి అనేది భూతద్దంలో వెతికినా కనిపించదని విమర్శించారు.
మేనిఫెస్టో ప్రకటన సభ ప్రత్యేకంగా: అన్ని సభలు తెలుగుదేశం - జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్నాయి. చంద్రబాబు- పవన్ కల్యాణ్ కలిసి పాల్గొనే సభలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి రూపొందించిన 22 పార్లమెంట్ స్థానాల షెడ్యూల్లో విశాఖ, నరసరావుపేట, హిందూపురం పార్లమెంట్లలో సభల నిర్వహణ షెడ్యూల్ త్వరలోనే ఖరారు కానుంది. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరుపేట, హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ధర్మవరంలలో జరిగే భారీ బహిరంగ సభలకు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ స్థాయి బహిరంగ సభలతో సంబంధం లేకుండా మేనిఫెస్టో ప్రకటన సభను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.
పార్లమెంటు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన - 'రా కదలిరా' పేరుతో బహిరంగ సభలు
బహిరంగ సభల షెడ్యూల్: బహిరంగ సభల షెడ్యూల్‌ను పరిశీలిస్తే, ఈ నెల 5న ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. 6వ తేదీన విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని ఆచంటల్లో బహిరంగ సభలు జరుగుతాయి. 9వ తేదీన తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డలో సభలు చేపడత్తారు. 10వ తేదీన విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో, కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తుని స్థానాల్లో బహిరంగ సభలు జరుపుతారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో: 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గుడివాడలో భారీ సభ నిర్వహించనున్నారు. 19వ తేదీన చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని జీడీ నెల్లూరులో, కడప పార్లమెంట్ పరిథిలోని కమలాపురం నియోజకవర్గాల్లో సభలు పెడతారు. 20వ తేదీన అరకు పార్లమెంట్ పరిధిలోని అరకు వ్యాలీ, అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మండపేటలో సభలు జరగనున్నాయి. 24వ తేదీన రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఉరవకొండల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు.
25న నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కోవూరు, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని పత్తికొండలో సభలు చేపడతారు. 27న రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని గోపాలపురం, గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు జరగనున్నాయి. 28న అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని మాడుగలలో, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని టెక్కలిలో సబలు ఉంటాయి. 29 ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగుటూరు, బాపట్ల పార్లమెంట్ పరిధిలోని చీరాలలో బహిరంగ సభలు ఉంటాయి.
రేపటి నుంచి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటనలు
Nara Bhuvaneshwari Nijam Gelavali: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రేపటి నుంచి నిజం గెలవాలి పర్యటనలు పునరుద్ధరించనున్నారు. రేపు విజయనగరం జిల్లా, ఈ నెల 4వ తేదీన శ్రీకాకుళం జిల్లా, 5వ తేదీన విశాఖ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి వారికి ధైర్యం చెప్తారు.
ఇప్పటికే పలు కుటుంబాలను ఆమె పరామర్శించగా, చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన సందర్భంగా పర్యటనలకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ప్రతి వారం మూడు రోజుల పాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. దాదాపు 200 మంది చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో చనిపోయారని పార్టీ వర్గాలు సమాచారం సేకరించటంతో ఆయా కుటుంబాలన్నింటినీ భువనేశ్వరి పరామర్శించనున్నారు.
Nara Lokesh Meetings: పార్టీ యువనేత నారా లోకేశ్ సైతం నియోజకవర్గ పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యువగళం పాదయాత్రలో తిరగలేకపోయిన నియోజకవర్గాల్లో లోకేశ్ సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత ఆయన పర్యటనలు ఉండొచ్చని పార్టీ వర్గాల సమాచారం.
చంద్రబాబుకు అరెస్టుతో మద్దతు పెరిగింది - అండగా నిలబడినవారందరికి కృతజ్ఞతలు : భువనేశ్వరి