గుంటూరు జిల్లా నకరికల్లు మండలం గుళ్లపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నరసరావుపేట ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. వాహన తనిఖీలు నిర్వహించగా.. సిమెంట్ లారీలో 2400 మద్యం సీసాలను గుర్తించినట్లు చెప్పారు. వాటి విలువ 4 లక్షల 72 వేలు ఉంటుందన్నారు. మద్యాన్ని తరలిస్తున్న 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మద్యం రవాణాకు వినియోగిస్తున్న సిమెంట్ లారీ, ఒక కారు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి, కేసు నమోదు చేశామని చెప్పారు.
డబ్బు ఆశ చూపి..
తెలంగాణలోని సుల్తాన్పూర్ తండాకు చెందిన రవినాయక్ అనే వ్యక్తి.. అదే ప్రాంతంలోని సిమెంట్ లారీ డ్రైవర్లకు డబ్బు ఆశ చూపి వారి వాహనాల్లో మద్యం తరలిస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. వాహన యజమానులకు ఈ మద్యంతో సంబంధం లేదని చెప్పారు. కానీ యజమానులు తమ డ్రైవర్లను నిత్యం గమనించుకోవాలని.. మద్యం తరలిస్తూ పట్టుబడితే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పిడుగురాళ్ల, నకరికల్లు మండలాలకు మద్యం సరఫరా అవుతుందనే సమాచారంతో తనిఖీలు నిర్వహించామన్నారు. పట్టుబడిన వారిలో నలుగురు తెలంగాణకు చెందినవారు కాగా.. మిగిలినవారు నకరికల్లు మండలానికి చెందినవారని చెప్పారు. ప్రధాన నిందితుడు రవినాయక్‌ను త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: Soil Excavation: ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా మట్టి తవ్వకాలు