వైకాపా ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండాను పార్లమెంట్లో ముందుకు తీసుకెళ్లారని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుుడు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ ఎంపీలను వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్‌తో కలసి దిల్లీలో రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ సమస్యలను లెవనెత్తాం. మాకున్న ఎంపీల పరంగా రాష్ట్ర అంశాలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లగలిగాము. వైకాపా ఎంపీలు రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పితే బాగుండేది. కానీ వారు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండాను ముందుకు తీసుకెళ్లారు. జీఎస్టీ బకాయిలు చాలా ఉన్నాయి. భాజపా పాలిత రాష్టాలు కూడా ధర్నా చేశాయి. కానీ వైకాపా మాత్రం జిఎస్టీపై ఎందుకు గొంతు విప్పలేదు. జగన్మోహన్ రెడ్డిపై కేసులున్నాయి. వాటి నుంచి బయటకు ఎలా రావాలి అనే అంశంపైనే ఆయన దృష్టంతా ఉంది. తన పార్టీ ఎంపీలను ఆయన వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారు. సీఎం జగన్ దిల్లీ వచ్చి రహస్య మంతనాలు నడిపారు తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. జగన్‌కి మళ్లీ జైలు భయం పట్టుకుంది. రాష్ట్రంలో మత కలహాలు జరుగుతున్నాయి. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని వైకాపా ఎంపీ పార్లమెంట్లో కోరారు. మంత్రులు దాడులకు నిప్పులు పొసే విధంగా మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో వైకాపా ఎంపీలు వారి నియోజకవర్గాల్లోకి వెళ్లలేని పరిస్థితి వస్తుంది- రామ్మోహన్ నాయుడు, తెదేపా ఎంపీ
పార్లమెంట్‌ను పక్కదారి పట్టించారు
రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. కొవిడ్‌పై పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే.. విజయసాయిరెడ్డి రాజ్యసభను ఒక రాజకీయ చర్చ వేదిక చేసుకొని మాట్లాడారు. పార్లమెంట్‌ను పక్కదారి పట్టించారు. ప్రత్యేక హోదా పక్కన పెట్టి... అమరావతి భూములపై సీబీఐ విచారణ అంటున్నారు. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన కూడా బయటకు చెప్పలేని దౌర్బాగ్య స్థితిలో ఉన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు. తితిదేని కూడా దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ సమావేశాలను వైకాపా రాజకీయ పబ్బం కోసం మాత్రమే వాడుకుంది. వారికి కావాల్సింది ప్రజలను విభజించి పాలించడమే. రాష్టంలో ఒక భయాందోళనకర పరిస్థితి నెలకొంది- కనకమేడల రవీంద్ర కుమార్, రాజ్యసభ సభ్యుడు
3 రాజధానులు చట్ట వ్యతిరేకం
3 రాజధానులు చట్టప్రకారం సాధ్యం కాదు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాం. అమరావతిపై మా అభిప్రాయాలతో హోంశాఖ కార్యదర్శి ఏకీభవించారు. జీఎస్టీ, పోలవరం నిధులు సహా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను అడిగాం. ఆంగ్ల మాధ్యమ విద్యపై నిర్మాణాత్మక సూచనలు చేశాం. ఆలయాలు, దళితులపై దాడుల గురించి మాట్లాడాం. 23 బిల్లులపై చర్చలో తెదేపా పాల్గొని అభిప్రాయాలు చెప్పింది. ఆర్థిక వ్యవహారాల్లో కీలక సలహాలు ఇచ్చాం- గల్లా జయదేవ్, తెదేపా ఎంపీ