నిరుపేదల పొట్టగొట్టి వారికి అందాల్సిన రేషన్ బియ్యాన్ని అధికారపార్టీకి చెందిన నేతలే మాఫియాలుగా మారి అక్రమ మార్గంలో వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని తెదేపా నేత అరవిందబాబు ఆరోపించారు. కరోనా సమయంలో ప్రజలకు చేయూతనివ్వాల్సిన ప్రభుత్వ అధికార పెద్దలు మాఫియాలుగా ఏర్పడి పలు రకాల దందాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూదందా మాఫియా, చివరికి రేషన్ మాఫియాలుగా ఎటుచూసినా వైకాపా నాయకులే రాష్ట్రంలో కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అక్రమాలకు తావులేదని.. అక్రమాలకు పాల్పడితే వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెబుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి..వైకాపా నేతలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూస్తామని అన్నారు.
ఆదివారం నరసరావుపేట రావిపాడు రోడ్డులోని స్వప్న ట్రేడర్స్ లో వెలుగుచూసిన 4 వేల రేషన్ బియ్యం బస్తాల అక్రమ నిల్వలను అధికారులు పట్టుకోవడం జరిగిందన్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో వైకాపా పార్టీకి చెందిన నేతలే రేషన్ బియ్యం మాఫియాగా మారి దందాలు చేస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో ఇసుకను అక్రమ మార్గాల్లో అమ్ముకుని ఇళ్లకట్టడాల పనులు లేకుండా చేసి సుమారు 30 లక్షల మంది సిమెంట్ కార్మికులను ఆకలితో అలమటించేలా చేశారన్నారు. అంతేకాకుండా కరోనా లాక్ డౌన్ సమయంలో వైకాపా నేతలు మద్యం దుకాణాల నుండి మద్యాన్ని దొంగతనం చేసి అధిక ధరలకు అమ్ముకున్నారన్నారు. పేదలకు ఇల్లాస్థలాల పేరుతో భూ దందాలు చేశారని తెలిపారు. నరసరావుపేటలో దొరికిన 4 వేల బస్తాల రేషన్ బియ్యం అక్రమ నిల్వలలో పట్టుబడ్డ వైకాపా దోషులను.. వారికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలపై ముఖ్యమంత్రి, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 5 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు