గ్రామ సచివాలయలకు అద్దెలు చెల్లించలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు ఎలా కడతారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. మూడు రాజధానులతో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని విమర్శించారు. రాజధాని నిర్మాణం చేతకాకపోతే చేతులు కట్టుకుని కూర్చోవాలని హితవు పలికారు. రాజధానిలో రహదారులు, మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయకపోతే పెట్టుబడులు ఏ విధంగా వస్తాయని ప్రశ్నించారు. అమరావతిపై జగన్మోహన్ రెడ్డి విధ్వంసకాండను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణానదిపై తెదేపా ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఐకానిక్ బ్రిడ్జి ఫ్లాట్ ఫామ్‌ను జగన్ అన్యాయంగా ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్దికి దిక్సూచిగా ఉన్న వాటిని విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఏటా 60 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి శాసన మండలి నడిపించడం అవసరమా అంటు నీతులు చెప్పారని.. అలాంటప్పుడు ఎందుకు రద్దుచేయ్యడం లేదని నిలదీశారు. రైతులు, రైతు కూలీలు అమరావతి కోసం ఉద్యమం చేస్తుంటే పట్టించుకోకపోవడం దారుణమని దుయ్యబట్టారు. కౌలు, పెన్షన్లు ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకని రెండేళ్లైనా మూడు ప్రాంతాల్లో మూడు భవనాలుగానీ, మూడు రోడ్లు గానీ, మూడు ఉద్యోగాలు గానీ ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇదీ చదవండి: FLEXI: తాడేపల్లి: సీఎం జగన్ నివాసం సమీపంలో ఫ్లెక్సీ కలకలం