పులిచింతల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడం ప్రభుత్వ వైఫల్యానికి, పర్యవేక్షణ లోపానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ బృందం స్పష్టం చేసింది. వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల్లో నాణ్యత కొరవడిందని.. ఇందుకు తోడు ప్రస్తుత ప్రభుత్వం నిర్వహణ వైఫల్యమే కారణమని తెదేపా నేతలు ఆరోపించారు. గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్ట్ వద్ద 16వ క్రస్టు గేటు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు.
మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. జలయజ్ఞం పేరుతో ఆనాటి వైఎస్సార్ ధనయజ్ఞం చేశారని చెప్పడానికి పులిచింతల ఉదాహరణ అని ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రాజెక్టులపై నిపుణులతో ప్రత్యేక అధ్యయనం చేయించాలని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. వార్షిక మరమ్మతు నిధులు కూడా ఇవ్వటం లేదన్నారు.
పులిచింతల గేట్ కొట్టుకుపోతే ప్రజల ప్రాణాలకు, పంటలకు భద్రత ఎవరు వహిస్తారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో పనులు చేసి.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గేటు కొట్టుకుపోతే చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఘటనకు జగన్ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కొమ్మాలపాటి డిమాండ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
ఏపీలో ఆర్థిక అత్యయిక స్థితి ప్రకటించాలి: రాష్ట్రపతికి ఎంపీ రఘురామ లేఖ