Chandrababu in Skill Case: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం పట్ల తెలుగుదేశం ముఖ్య నేతలు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వస్తుందన్న ఆలోచనతోనే... మద్యం కుంభకోణమంటూ ప్రభుత్వం మరో కేసును తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. కోట్లాది మంది తెలుగు ప్రజల పూజలు ఫలించాయని నేతలు వ్యాఖ్యానించారు. మద్యం డిస్టిలరీ లైసెన్సుల విషయంలో అవినీతి జరిగిందని మరో కేసు పెట్టారని నేతలు ఆరోపించారు.
అచ్చెన్నాయుడు స్కిల్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వాగతించారు. ఏ తప్పూ చేయని అధినేతను 52 రోజులుగా అక్రమంగా జైల్లో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అచ్చెన్న భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే వైకాపా సమాధి కావడం ఖాయమన్నారు.
చింతమనేని ప్రభాకర్: చెయ్యని నేరానికి చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని.. ఈ కేసులో తమ నాయకుడు కడిగిన ముత్యంగా బయటకు వస్తారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు ఫైర్ స్టేషన్ కూడలిలో కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించిన ఆయన....మిఠాయిలు పంచి సంతోషాన్ని పంచుకున్నారు.
కనకమేడల రవీంద్రకుమార్: చంద్రబాబును అరెస్టు చేసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. స్కిల్ కేసులో చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిని అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ, పోలీసులను వైసీపీ అనుబంధ సంస్థగా మార్చారని విమర్శలు గుప్పించారు. సీఐడీ అధికారులు మనీ ట్రయల్ జరిగిందని నిరూపించలేకపోయారని... డబ్బులు మారినట్లు జరిగిందా అని కోర్టు అడిగితే.. విచారించి వివరాలు సేకరిస్తామన్నారనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుకు బెయిల్ రావడంపై కనకమేడల ఆనందం వ్యక్తం చేశారు.
రామ్మోహన్ నాయుడు: చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషకరంమని ఎంపీ రామ్మోహన్ పేర్కొన్నారు. ప్రజలకు చంద్రబాబును దూరం చేయాలనే జైలులో పెట్టారని ఆరోపించారు. చివరకు చంద్రబాబు మెడికల్ రిపోర్టును కూడా తారుమారు చేశారని రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు. వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని తెలుగుదేశం నేత కన్నాలక్ష్మీనారాయణ పేర్కొన్నారు. చంద్రబాబుపై పెట్టింది అక్రమ కేసు అని అందరికీ తెలుసని.. కేవలం కక్షసాధింపు కారణంగానే చంద్రబాబుపై కేసులు పెట్టారని కన్నా ఆరోపించారు. సైకో సీఎంను ప్రజలు ఇంటికి పంపటం ఖాయమని కన్నా లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు.
ధూళిపాళ్ల నరేంద్ర: కోట్లమంది తెలుగువారి పూజలు ఫలించాయని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర వెల్లడించారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందని తెలిసి.. కొత్తగా మద్యం కేసు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ కార్పొరేషన్‌లో పనిచేసే అధికారి కేసు పెట్టడం విడ్డూరంగా ఉందని ధూళిపాళ్ల ఎద్దేవా చేశారు. ఇవి కేవలం ప్రభుత్వం ప్రోత్సాహంతో పెట్టే కేసులంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు విషయములో బెయిల్ మంజూరు కావడం ఆనందదాయకమని, సుప్రీంకోర్టులోనూ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పాలిటి బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
ప్రత్తిపాటి పుల్లారావు: ప్రజల ఆకాంక్ష ఫలితంగా న్యాయం గెలిచిందని తెలుగుదేశం నేత ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చంద్రబాబుకు బెయిల్ రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ బెయిల్ వస్తుందని తెలిసిన వైసీపీ నేతలు చంద్రబాబుపై మరో కేసు పెట్టించారని పుల్లారావు ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ ఓటమి ఖాయమని వెల్లడించారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం చాలా సంతోషకరమని మాజీ, కేంద్ర మంత్రి చింతా మోహన్ తెలిపారు. వేరే కేసుల్లో మళ్లీ అరెస్టు చేస్తారేమోనన్న అనుమానాలున్నాయని పేర్కొన్నారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా చంద్రబాబును బయటకు పంపించాలని ఆయన డిమాండ్ చేశారు.
నక్కా ఆనంద్‌బాబు: చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జగన్ పైశాచిక ఆనందం పొందారని నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. చంద్రబాబు అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ వచ్చిందని తెలిపారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంపై తెలుగుదేశం నేత జీవీ ఆంజనేయులు స్పందించారు. స్కిల్ తదితర కేసుల్లో చంద్రబాబు నిప్పులా బయటకు వస్తారని ఆంజనేయులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు.
యరపతినేని శ్రీనివాసరావు: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వస్తుందన్న సంకేతాలతోనే... జగన్ ప్రభుత్వం కొత్త కేసులు పెడుతోందని... తెలుగుదేశం నేత యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. జగన్ సొంత కంపెనీలతో కల్తీ మద్యం తయారుచేస్తూ... చంద్రబాబుపై కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం ఆనందించదగ్గ విషయమని... మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబు కోసం కోట్లాది మంది ప్రజలు చేసిన ప్రార్థనలను న్యాయదేవత ఆలకించిదని.. సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆయన అన్ని కేసుల నుంచి బయటపడతారని ఆకాంక్షించారు.
TDP Leaders Celebrations Over CBN Interim Bail: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. టీడీపీ శ్రేణుల సంబరాలు