స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలుగుదేశం పార్టీ స్వాగతించింది. ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు చెప్పిన విషయమైనా సీఎం జగన్కు అర్ధమవుతుందా? అని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోనిదనే మరోసారి పునరుద్ఘాటించి సంగతి గుర్తు చేశారు.
తనకు ప్రతికూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీం జడ్జిలకూ సీఎం జగన్ కులం ఆపాదిస్తారేమోనని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్‌ను సడలించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కొత్త పథకాలు వద్దని సుప్రీంకోర్టే చెప్పిందని.. దానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తిపై సీఎం అవగాహనరాహిత్యంతో మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లీచింగ్ పౌడర్, పారాసిటమల్‌తో పోతుందనడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా ప్రజారోగ్యంపై సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర బలగాలతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని నిమ్మల రామానాయుడు కోరారు. నామినేషన్లు వేసిన వారిని పోలీసులే బెదిరించారని ఆరోపించారు. చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో ఎన్నికలు జరగలేదని అన్నారు.
ఇదీ చదవండి : మాన్సాస్ ట్రస్టు వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా