మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి కేసులో రైతులపైన హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయడం దారుణమని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై నమోదు చేసిన 307 సెక్షన్ తక్షణమే తొలగించి... అరెస్ట్ చేసిన అన్నదాతలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ గుంటూరు అర్బన్ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే గన్మెన్ దురుసుగా ప్రవర్తించడం వలనే ఎమ్మెల్యే కారుపై దాడికి యత్నించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. దాడిలో పాల్గొన్న వారిపైనే కేసులు నమోదు చేయాలి తప్ప... అమాయకులపైన నమోదు చేయడం సరికాదన్నారు. రాజధాని కోసం వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడికి ఎమ్మెల్యే ఎందుకు వచ్చారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. ఎమ్మెల్యే కావాలనే రెచ్చకొట్టేందుకే హైవే పైకి వచ్చారని ఆయన ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేయలేరని ఆయన వెల్లడించారు. రాజధానిపై ప్రకటన వచ్చేవరకు ఆందోళనలు కొనసాగుతాయని ఆనంద్ బాబు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం: