TDP leaders fires on YSRCP: గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవింద బాబు వైద్యశాల నుంచి డిశ్చార్జైన అనంతరం.. పలువురు తెదేపా నాయకులు ఆయనను పరామర్శించారు.
పోలీసుల దాడి దుర్మార్గం..
జొన్నలగడ్డలో అరవింద బాబుపై పోలీసులు దాడి దుర్మార్గపు చర్య అని..ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ.. రాష్ట్రం పరువు తీస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత దుర్మార్గం జరుగుతుంటే..డీజీపీ మౌనం వహించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జొన్నలగడ్డలో అపహరించిన వైఎస్ఆర్ విగ్రహం ఎక్కడ ఉందో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ విగ్రహాన్ని మాయం చేస్తే తెదేపా నేతలపై కేసులా..?
జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహాన్ని ఎవరో మాయం చేస్తే.. తెదేపా నేతలపై పోలీసులు కేసులు పెట్టడం అమానుషమన్నారు. ప్రజల్లో సానుభూతి పొందేందుకే.. వైకాపా నేతలు విగ్రహ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.
వైకాపా నేతలు భయపడే ఇలా చేస్తున్నారు..
మాచర్ల ఘటనలో తెదేపాకు ప్రజల్లో సానుభూతి ఎక్కడ వస్తుందోనని భయపడుతున్న వైకాపా నేతలు.. అనేక నాటకాలు చేస్తూన్నారని విమర్శించారు. అన్యాయాలపై తెదేపా ఆందోళనలు చేస్తే.. వైకాపా నాయకులు మరో కోణంలో ఆందోళనలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని ఎత్తులు వేస్తున్నారని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలు వైకాపా నాయకులకు తప్పనిసరిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
డీజిల్ పై వ్యాట్‌ను ఎత్తివేస్తామన్నారు..
గత ఎన్నికల్లో మోటార్ ఫీల్డ్ యజమానులకు డీజిల్ పై వ్యాట్‌ను ఎత్తివేస్తామని వాగ్ధానం చేసి వైకాపా నేతలు గద్దెనెక్కారన్నారు. ప్రస్తుతం డీజిల్ పై వ్యాట్ ను తొలగించకపోగా.. కొత్తగా హరిత పన్ను వేసే విధానానికి ప్రభుత్వం ఆలోచించడం సరికాదన్నారు. విద్యార్థులు ప్రస్తుత తరుణంలో కరోనా బారిన పడకుండా ఉండాలంటే.. పాఠశాలలకు సెలవులు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే..
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని వైకాపా నేతలు చూస్తున్నట్లు తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. చిచ్చుపెడితేనే పార్టీ మనుగడ ఉంటుందని వైకాపా నేతలు ఆలోచన చేయడం శోచనీయమన్నారు. పార్టీ వర్గీయులే జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహాన్ని మాయం చేశారనేది నిజమన్నారు.
ఏపీ బీహార్ ను దాటి పోయింది..
రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన అరాచకంగా ఉందని.. ఈ విషయంలో ఏపీ బీహార్ ను దాటి పోయిందని.. తెదేపా నేత జీవీ ఆంజనేయులు అన్నారు. అక్రమ కేసులు పెట్టినందుకు పోలీసులను అందలం ఎక్కిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లపై కూడా దుర్మార్గంగా కేసులు పెట్టిందని మండిపడ్డారు. లక్ష కోట్లు దోచుకున్న సీఎం జగన్.. జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. వినుకొండలో నరేంద్ర అనే రైతుపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తిస్తే.. రైతు పైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ కేసులో సీఐ పై చర్యలు తీసుకుంటున్నామని చెప్పి.. అతనికి పదోన్నతిపై పోస్టింగ్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: