రాష్ట్రంలో మంచినీటి కొరత ఉంది కానీ మద్యం కొరత ఎక్కడా లేదని మాజీ మంత్రి జవహర్ దుయ్యబట్టారు. మద్యపాన నిషేధం అంటే మద్య సేవనంగా ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన మద్యపాన నిషేధం ఓ ఫెయిల్యూర్ స్టోరీ అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అండ్ కో ఏటా రూ. 5 వేల కోట్ల మద్యం ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ప్రజలను మత్తులో ఉంచి ముడుపులు దండుకోవడం తప్ప మద్యపాన నిషేధం వైకాపా ప్రభుత్వం వల్ల కాదని జవహర్ స్పష్టంచేశారు. నాసిరకం మద్యాన్ని తీసుకువచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. నంద్యాల కేంద్రంగా అనుమతుల్లేని డిస్టిలరీల నుంచి మద్యం సరఫరా అవుతోందని ఆరోపించారు. తానూ ఉన్నానని చెప్పుకునేందుకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి 6 నెలలకోసారి బయటకు వస్తున్నారని విమర్శించారు.
పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి: పిల్లి మాణిక్యరావు
డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు డిమాండ్ చేశారు. గుంటూరులో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితలకు రక్షణ కరవైందన్నారు. తక్షణమే సీఎం జగన్ స్పందించి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. లేదంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
అన్నీ రద్దు చేస్తున్నారు: సప్తగిరి ప్రసాద్
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ విద్య అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మండిపడ్డారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించిన 'అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధిని' దూరం చేశారని ధ్వజమెత్తారు. అమ్మఒడి అందరికీ ఇస్తున్నామనే సాకుతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల లబ్ధిలో కోత పెట్టడం తగదని హెచ్చరించారు. చంద్రబాబు.. రాష్ట్రం నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని నిర్ణయిస్తే.. జగన్ తన తండ్రి విగ్రహం పెట్టాలనుకుంటున్నారని విమర్శించారు. తండ్రి విగ్రహానికి రూ. 250కోట్లు వెచ్చిస్తున్న సీఎం.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పథకాలకు రూ. 50 కోట్లు వెచ్చించలేరా అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి..