TDP LEADERS COMMENTS ON GOVERNOR SPEECH : ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో శాసనసభలు మొదలయ్యాయి. తొలిసారి రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ఎందుకు లేదని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై బహిరంగ ప్రసంగాలు చేసిన ప్రభుత్వం.. గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేకపోయిందని నిలదీశారు.
"గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ఎందుకు లేదు. గవర్నర్‌తో ముఖ్యమంత్రిని పొగిడించడం ఏమిటి?. ప్రథమ పౌరుడితో సీఎంను పొగిడించి గవర్నర్ స్థాయి తగ్గించారు. గవర్నర్‌ను సభాపతి కార్యాలయంలో కూర్చోబెట్టారు. గవర్నర్‌ను వేచి ఉండేలా చేయడం.. నిబంధనలకు విరుద్ధం. సుప్రీంకోర్టు జడ్జిగా చేసిన వ్యక్తితో అబద్ధాలు చెప్పించారు"-పయ్యావులు కేశవ్, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్
పాత గవర్నర్‌ను తాకట్టు పెట్టిన ప్రభుత్వం.. అలాంటి తప్పే ఇవాళ మళ్లీ చేసిందన్నారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రిని పొగిడించటమేంటని మండిపడ్డారు. రాష్ట్రానికి గవర్నర్ పెద్దా? లేక ముఖ్యమంత్రి పెద్దా? అంటూ నిలదీశారు. ప్రథమ పౌరుడితో సీఎంని పొగిడించి గవర్నర్ స్థాయి తగ్గించారని పయ్యావుల విమర్శించారు. ముఖ్యమంత్రి రాక కోసం గవర్నర్‌ను కూడా స్పీకర్ కార్యాలయంలో వేచి ఉండేలా చేశారన్న ఆయన.. ఇది సభా నిభంధనలకు విరుద్ధమన్నారు. శాంతి భద్రతల అంశం ఎక్కడా ప్రసంగంలో లేదని అన్నారు. ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్‌తో చెప్పించే ప్రయత్నం చేశారన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా చేసిన గవర్నర్‌తో ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
అసత్యాలు చదవలేక గవర్నర్ కూడా అనేకసార్లు ఇబ్బంది పడ్డారు: గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమంత్రి రంగుల పిచ్చి, పేర్ల పిచ్చి తప్ప మరేం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. తన చేత ఇన్ని అసత్యాలు పలికించినందుకు గవర్నర్ కూడా ఇంటికి వెళ్లి బాధపడి ఉంటారని వారు ఎద్దేవా చేశారు. వివిధ పథకాలకు సంబంధించి గవర్నర్‌తో ప్రభుత్వం చెప్పించిన లెక్కలన్నీ అంకెల గారెడీనే అని ఆరోపించారు. విభజన చట్టం 10 ఏళ్ల కాల పరిమితి ముగుస్తున్నా.. గవర్నర్ ప్రసంగంలో దానిపై ప్రస్తావన లేదని ఆక్షేపించారు. ఈ ఎన్నికల కాలానికి పోలవరం పూర్తి కాదనే అసమర్ధతను ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో చెప్పించారని విమర్శించారు. అసత్యాలు చదవలేక అనేక సార్లు గవర్నర్ కూడా ఇబ్బందిపడ్డారన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం సాగిందనన్నారు. పోలవరం, అమరావతి అంశాలపై ప్రస్తావనే లేదని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు.
ఇవీ చదవండి: