Dhulipalla Narendra made serious allegations on jagan: అవినీతికి జగన్మోహన్ రెడ్డి ఐకాన్, బ్రాండ్ అంబాసిడర్ అని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పుతో జగన్ మైండ్ బ్లాంక్ అయిందన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నుంచి పక్క దారి పట్టించే ప్రయత్నమే ఇవాళ సభలో జరిగిందని దుయ్యబట్టారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన జగన్, మంచి స్క్రిప్ట్ రాసి సినిమా తీస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల దెబ్బకే దిమ్మ తిరిగిందని, రాష్ట్రంలోని ప్రజలంతా జగన్ను కొడితే పాతాళంలోకి వెళ్లిపోతారని ఆక్షేపించారు.
రాజధాని నిర్మాణం పేరుతో కొత్త కథని తెచ్చారని, ఈ నాలుగేళ్లు ఏం చేశారని నరేంద్ర నిలదీశారు. దర్యాప్తు సంస్థలు ఉండగా సభా సమయాన్ని వృథా చేసేలా సభలో ఈ తరహా చర్చలెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. సభలో ఇచ్చే ప్రజెంటేషన్ ఏదో అకాల వర్షాల వల్ల రైతులను ఆదుకోవడం విషయంలో ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందని హితవు పలికారు. అవినీతి ఆధారాలుంటే దర్యాప్తు సంస్థలకు అప్పగించకుండా సభలో ప్రజెంటేషన్లు ఏంటనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై బురద జల్లడానికే తప్ప ఈ విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు టీడీపీపై ఆరోపణలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోపణలను నిరూపించలేకపోయారని విమర్శించారు.
తెలుగుదేశం నేతలు ఆరు లక్షల కోట్లు తినేశారంటూ నాలుగేళ్లుగా చెబుతూనే ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ ధ్వజమెత్తారు. ఆరు లక్షల కోట్ల ఆరోపణలు చేసిన జగన్, ఇప్పుడు 15 కోట్ల రూపాయలకు వచ్చారని, ఇది కూడా అవాస్తవమని తేల్చిచెప్పారు. టీడీపీ 6 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తే నాలుగేళ్లు ఏం చేశారనీ నిలదీశారు. జగన్, మంత్రులు మాట్లాడేది ప్రతిదీ బోగస్సేనని ఆక్షేపించారు. తమ దగ్గరున్న డాక్యుమెంట్సుతో వస్తాం.. చర్చకు సిద్దమా అని ఏడేళ్ల ఐటీ రిటర్న్స్ తో చర్చకు వస్తామన్నారు. లక్షల రూపాయల ప్రజాధనంతో సభను జరుపుతూ టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మళ్లీ ఈ రోజు షాపూర్జీ పల్లోంజీ వ్యవహారం తెరపైకి తెచ్చారని బొండా ఉమ మండిపడ్డారు. టీడీపీ అధికారంలో అవినీతి జరిగిందని ఆరోపించిన వైసీపీ ఈ నాలుగు సంవత్సరాల పాటు ఎందుకు నిరూపించలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై మాట్లాడటానికి వినియోగించాల్సిన అసెంబ్లీని ప్రతిపక్షాలపై బురద చల్లడానికి ఉపయోగించుకుంటున్నారని బొండా ఉమ విమర్శించారు. గత నాలుగు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. స్కిల్ డెవలప్మెంట్లో 374కోట్లు అవినీతి జరిగినట్లు చేసిన ఆరోపణలు ఎందుకు నిరూపించలేకపోతున్నారని విమర్శించారు.
ఇవీ చదవండి: