Telugu Desam Party Foundation Day: తెలుగుదేశం 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని వెల్లడించారు. వరుసగా ఎమ్మెల్సీల స్థానాల గెలుపుతో జోష్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ నెల 28వ తేదీ నుంచి వరుస కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు, సంస్థాగత కార్యక్రమాల మిళితంగా ఈ నెల కార్యాచరణ రూపొందించింది. మార్చి 28వ తేదీ హైదరాబాద్లో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. సుదీర్ఘ కాలం తరువాత హైదరాబాద్లో పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుండటం విశేషం. మేలో జరిగే మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై పలు తీర్మానాలు చేయనున్నారు.
తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయించింది. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మార్చి 29న ఈ మేర హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించే సమావేశాలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. క్లస్టర్ ఇంచార్జ్ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ నాయకులవరకు ఆవిర్భావ సభకు హాజరుకానున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో విశాఖ, నెల్లూరు, కడప జిల్లాలలో పార్టీ జోన్-1, జోన్ -4, జోన్ -5 సమావేశాలు నిర్వహించాలని తెలుగుదేశం నేతలు నిర్ణయించారు.
జోన్ సమావేశాల అనంతరం అధినేత చంద్రబాబుతో సహా రాష్ట్ర నాయకత్వం అంతా మళ్లీ జనంలోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. మెున్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని ప్రజలతో పంచుకోవడంతో పాటు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయే ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. వివిధ ప్రజా సమస్యలపై నియోజకవర్గ, జిల్లా స్థాయి పోరాటాలకు టీడీపీ నేతలు, కార్యకర్తలను కలుపుకోని పోరాడే విధంగా కసరత్తు చేస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నుంచి గ్రామ స్థాయి నేత వరకు అంతా క్షేత్రస్థాయిలో ఉండేలా కార్యక్రమాల రూపకల్పన జరుగుతున్నట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. ముఖ్యంగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వాంపై ప్రజల్లో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు రూపొందించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
ఇవీ చదవండి: