TDP Preparations for MLC Elections: రాష్ట్రంలో త్వరలో జరగనున్న 13 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో.. అవకాశం ఉన్నచోట పట్టుసాదించే దిశగా తెలుగుదేశం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుత బలాబలాల దృష్ట్యా.. 8 స్థానాల్లో పార్టీ గెలిచే అవకాశాలు లేవు. 3 పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ స్థానాలు కలిపి మిగతా 5 స్థానాల్లో ఎన్నికలు.. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరగనున్నాయి. ఇందులో 3 పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్న ప్రధాన ప్రతిపక్షం.. మరో రెండు ఉపాధ్యాయ స్థానాల్లో ఆయా సంఘాల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది.
పశ్చిమ రాయలసీమ పరిధిలోని కర్నూలు-కడప-అనంతపురం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం తరఫున భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పోటీచేస్తున్నారు. గత ఏడాది నుంచి ఆయన ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో సమన్వయం చేసుకుంటూ.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం ముమ్మరం చేశారు. ఇక తూర్పు రాయలసీమకు సంబంధించి.. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ప్రస్తుతం లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ పరిధిలోనే సాగుతుండటంతో.. శ్రీకాంత్‌ను గెలిపించాలంటూ ఆయన తన సభల్లో ఓటర్లను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తున్నారు. స్థానిక సమస్యలతోపాటు.. ఆయా జిల్లాల నుంచి పరిశ్రమలు తరలిపోయి యువతకు ఉద్యోగాలు లేకుండా పోతోందన్న అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి వేపాడ చిరంజీవిరావు పోటీ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని తెలుగుదేశం భావిస్తోంది.
ఐటీ సంస్థలు విశాఖ నుంచి తరలిపోవడం, నిరుద్యోగం, ఉద్యోగుల్లో అసంతృప్తి, భూకబ్జాలు, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ, మాదకద్రవ్యాలకు ఉత్తరాంధ్ర అడ్డాగా మారడం వంటి అంశాలు.. తమకు కలిసివస్తాయని తెలుగుదేశం అంచనా వేస్తోంది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. విద్యావంతులు తమవైపే మొగ్గు చూపుతారనే ధీమాతో తెలుగుదేశం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు.. నకిలీ ఓట్లను సృష్టించి.. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. ఆ కుట్రల్ని ఛేదించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలుగుదేశం నేతలు తెలిపారు.
తూర్పు, పశ్చిమ రాయలసీమ జిల్లాల పరిధిలో జరిగే 2 ఉపాధ్యాయ స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థులకు తెలుగుదేశం మద్దతు ప్రకటంచింది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డికి అలాగే తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎల్సీ రమణారెడ్డి గెలుపుకోసం తెలుగుదేశం ప్రచారం చేపట్టింది.
"యువత చాలా ఆగ్రహంగా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మోసం చేశారో దానికి యువత.. ఈ ఎన్నికల ద్వారా గుణపాఠం చెబుతుంది. ఉద్యోగులకు కూడా అనేక విధాలుగా ప్రలోభాలు పెట్టి ఆయన ఓట్లు దండుకున్నారు". - భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి
"గత నాలుగైదు నెలలుగా నేను అన్ని స్కూల్స్, కాలేజీలకు వెళ్లి ఓటు గురించి విజ్ఞప్తి చేయడం జరిగింది. చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి.. నిరుద్యోగులకు ప్రైవేటు సెక్టార్లో కూడా ఉద్యోగాలను దూరం చేశారు". - కంచర్ల శ్రీకాంత్, పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి
ఇవీ చదవండి: