MLAs Poaching Case Updates: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ కేసు ఈనెల 17న సుప్రీంలో విచారణకు రానుంది. అప్పటివరకు దానిపై స్టేటస్ కో ఇవ్వాలని కోరగా.. ప్రభుత్వ విజ్ఞప్తిని సీజేఐ నిరాకరించారు. ఇటు హైకోర్టులోనూ తీర్పు ఆపాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సీజే అంగీకరించలేదు.
కేసు దస్త్రాల కోసం సీబీఐ ఒత్తిడి చేస్తోందని, సింగిల్ జడ్జి వద్ద విచారణకు అనుమతి ఇవ్వాలని సీజేను ఏజీ కోరారు. అయితే డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చాక మళ్లీ సింగిల్ జడ్జి విచారణ జరపరాదని, సుప్రీంకోర్టు మాత్రమే సమీక్ష చేస్తుందని సీజే తెలిపారు.
ఇదీ జరిగింది: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పర్డీవాలా ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ఈ కేసును మెన్షన్ చేశారు. ఒకవేళ ఈ కేసులో సీబీఐ ప్రవేశిస్తే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు అంతా దెబ్బతింటుందని ధర్మాసనానికి విన్నవించారు.
ఇవీ చదవండి: