సాటి మనిషికి ఉపయోగపడితేనే.. ఏ విద్యకైనా సార్థకత. కేవలం తరగతి పాఠాలకే ఇంజినీరింగ్ విద్య పరిమితమైతే ఆ లక్ష్యం నెరవేరదు. ప్లేస్మెంట్ విషయంలోనూ.. ఆవిష్కరణలు చేస్తున్న విద్యార్థులకే కొన్నేళ్లుగా పరిశ్రమలు పెద్దపీట వేస్తున్నాయి. అదే దారిలో బయోమెట్రిక్ ఆధారంగా ఓటుహక్కు ఇవ్వాలన్న...ఆలోచనలతోపాటు మరెన్నో కొత్త ఆలోచనలకు విద్యార్థులు రెక్కలు తొడిగారు.
ఓటుకు బయోమెట్రిక్
ఎన్నికల్లో ఓటహక్కు వినియోగం కీలకం. కొన్నిచోట్ల మనం వెళ్లేలోగా వేరే వారెవరో ఓటు వేసే అవకాశముంది. ఇంకా ఎన్నో సమస్యలుంటాయి. ఈ సంప్రదాయ విధానం పోవాలంటే వేలిముద్ర ఆధారిత...బయోమెట్రిక్ విధానం మంచిదంటున్నారు చలపతి ఇంనీరింగ్ విద్యార్థులు. ఈ విధానం ద్వారా అసలైన ఓటరు మాత్రమే ఓటు వేసే అవకాశముంటుందని చెబుతున్నారు.
దివ్యాంగులకు సాయం
ప్రమాదాల్లో కాలు, చేతులు పోగొట్టుకున్నప్పుడు కొందరు చక్రాల కుర్చీకే పరిమితమవుతారు. కాలు, చేయి కదపలేని వారు చక్రాల కుర్చీ నడుపుకొనే వెసులుబాటును కల్పించారు. తలకు అమర్చిన సెన్సార్ పరికరాలతోనే చక్రాల కుర్చీని నియంత్రించే ఆవిష్కరణను రూపొందించారు. ఎవరి సాయం లేకుండానే వారు ముందుకు కదిలే వెసులుబాటు కల్పిస్తోందీ ఈ సెన్సార్.
ఆపదలో అండగా..
ప్రమాదాలు జరిగేటప్పుడు ఆప్తులకు, ఆసుపత్రులకు సమాచారం వెళ్లడం కీలకం. మెటారు వాహనాలకు అమర్చిన జీపీఎస్ పరికరాలు, సెన్సార్ ద్వారా ఈ సమాచారాన్ని తక్షణం చేరవేసే విధానాన్ని కనుగొన్నారు ఇంజినీరింగ్ విద్యార్థులు. గుండెపోటు, రక్తపోటు వంటివి ఉండే రోగుల కోసం ఆసరాగా మరో పరికరాన్ని కనిపెట్టారు. ప్రమాదం జరిగిన వ్యక్తి చేతికి అమర్చిన బ్యాండ్ ద్వారా...రక్తపోటు, పల్స్ రేటును ఇంటి వద్ద బంధువులు గమనించి.. అప్రమత్తం చేయవచ్చు.
అతివేగానికి కట్టడి
పాఠశాలలు, ఆస్పత్రులు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో..... ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మరో పరికరాన్ని రూపొందించారు కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు. వేగంగా వెళ్తున్నా.... ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నా....ముందుగా డ్రైవర్‌కు సంకేతం అందుతుంది. అప్పటికీ డ్రైవర్ పట్టించుకోకపోతే ఆటోమేటిగ్గా చక్రాలకు అమర్చిన సెన్సార్, ఇతర పరికరాలతో ఆ వాహనం నిలిచిపోతుంది.
అంధులకు ఆసరా
అంధులకు ఆసరాగా నిలిచే ఆశయంతో బ్లైండ్ స్టిక్‌ను ఆవిష్కరించారు. కర్రకు అమర్చిన సెన్సార్ సాయంతో ఎదురుగా వస్తున్న మనుషులు, వాహనాలు, వస్తువులను గుర్తించవచ్చు. ఎక్కడైనా పడిపోతే...వారి బంధువులకు సంకేతాలు అందించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది అంధులకు ఎంతో ఉపయోగకరమంటున్నారు విద్యార్థులు.