Widow's Pension in Telangana : తెలంగాణలో ఆసరా వృద్ధాప్య పింఛను లబ్ధిదారు చనిపోతే వారి జీవిత భాగస్వామికి 15 రోజుల్లో వృద్ధాప్య పింఛనుకు సంబంధించి జారీ అయిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణ చేసింది. లబ్ధిదారు మరణిస్తే జీవిత భాగస్వామి ఆధార్ కార్డు ప్రతి, మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని వెంటనే పింఛను మంజూరు చేయాలని గ్రామీణావృద్ధి శాఖ రెండు వారాల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా.. లబ్ధిదారు జీవిత భాగస్వామి వయసు 57 ఏళ్లకు తక్కువగా ఉంటే వృద్ధాప్య పింఛనుకు బదులు వితంతు పింఛను మంజూరు చేయాలని పేర్కొంది.
జీవిత భాగస్వామి తన ఆధార్‌తో పాటు చనిపోయిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రాన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణాల్లో బిల్ కలెక్టరుకు ఇవ్వాలని సూచించింది. ఈ పత్రాలు అందిన వెంటనే దరఖాస్తును ఎంపీడీవో/మున్సిపల్ కమిషనరుకు పంపించాలని పేర్కొంది. జీవిత భాగస్వామి/ వితంతు పింఛను మంజూరుకు ఆసరా పోర్టల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, దరఖాస్తులను వెంటనే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి/ జిల్లా కలెక్టర్ల ఆమోదం కోసం పంపించాలని ఆయా అధికారులకు సూచించింది. పోర్టల్‌లో నమోదైన 15 రోజుల్లో పింఛను మంజూరు చేయాలని ఆదేశించింది. జీవిత భాగస్వామికి వృద్ధాప్య/వితంతు పింఛను మంజూరు నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆసరా పింఛను కోసం అదనపు పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
ఇవీ చూడండి..: