నిజమైన ఫ్యాక్షనిస్ట్ అంటే ఎలా ఉంటారో ఇప్పడు చూస్తున్నామని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. డీజీపీ కార్యాలయ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ఆయనను గృహనిర్భంధం చేశారు. ఇంటి నుంచి బయటకు రావొద్దని నోటీసులు జారీ చేశారు. హిందూ ఆలయాలపై ఏడాదిన్నరగా దాడులు జరుగుతున్నా, కారణాలు చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాను చెబుతున్నానని.. గృహ నిర్బంధాలే అందుకు నిదర్శనమని అన్నారు. సంక్షేమ పథకాలతో డబ్బులు పంచి మళ్లీ ఎన్నికల్లో గెలవొచ్చని భావిస్తున్నారని ఆరోపించారు. విగ్రహాల ధ్వంసానికి కారకులు ఎవరో ప్రభుత్వం వారంలోగా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సమర్ధత ఉంటే అసలు దోషులు ఎవరో చెప్పేవారని... అది లోపించటం వల్లే కావాలనే భాజపాపై బురద జల్లుతున్నారని విమర్శించారు.
దేవాలయాలపై జరిగిన దాడుల్లో భాజపా కార్యకర్తల హస్తం ఉందన్న డీజీపీ వ్యాఖ్యలను.. ఆ పార్టీ నేతలు ఖండించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ.. భాజపా నేతలు పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. జాతీయ రహదారి నుంచి అక్కడికి చేరుకునేందుకు యత్నించిన ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలను.. పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి స్టేషన్కు తరలించారు. వైకాపాకు డీజీపీ అధికార ప్రతినిధిగా మారారని ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. ఏ ఆధారాలతో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండీ..: 'హైకోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాలకు వెళతాం'