Spinning Mills Closing Due to Electricity Charges Hike: రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా నూలు మిల్లులుండగా.. అందులో 80 వరకూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. స్థానిక పరిస్థితులతో పాటు అంతర్జాతీయ పరిణామాలు రెండేళ్లుగా స్పిన్నింగ్ మిల్లులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోకపోగా.. విద్యుత్ ఛార్జీల పెంపుతో అదనపు భారం మోపింది. తెలంగాణలో విద్యుత్తుపై యూనిట్‌కు 2 రూపాయలు రాయితీ ఇస్తున్నారు.
ఆ మేరకు మిల్లు యజమానులు బిల్లు తగ్గించుకుని చెల్లిస్తున్నారు. ఏపీలో మాత్రం యూనిట్‌కు రూపాయి విద్యుత్తు రాయితీ ఇస్తుండగా.. ఆ ఇచ్చేదీ.. ఏళ్ల తరబడి బకాయి పెడుతున్నారు. మిల్లు యజమానులు బిల్లు చెల్లించిన తర్వాత ప్రభుత్వం ఎప్పటికో రాయితీ సొమ్ము విడుదల చేస్తోంది. యూనిట్‌కు 6 పైసలు ఉన్న విద్యుత్తు సుంకాన్ని రూపాయికి పెంచింది.
ట్రూఅప్, ఎఫ్‌పీసీసీఐ తదితర ఛార్జీలు కలిపి యూనిట్‌కు రెండురూపాయల 20 పైసల వరకు అదనపు భారం పడుతోంది. దారం ఉత్పత్తికి అయ్యే వ్యయంలో 30 శాతం విద్యుత్తు వాటా ఉంటుంది. కిలో నూలు తయారికి 4 యూనిట్ల మేర కరెంటు అవసరం. ఈ ప్రకారం కిలోకు 10 రూపాయలవరకు అదనపు భారం పడుతోంది. దీనికితోడు వివిధ విభాగాల కింద టైక్స్‌టైల్స్ పరిశ్రమకు రావాల్సిన 13 వందల 50 కోట్లు బకాయిలు విడుదల చేయడం లేదు. అవి విడుదల చేసినా మిల్లులకు కొంత ఉపశమనం లభిస్తుంది.
కేంద్రం పరిశ్రమలకు ఇచ్చే టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ ఫంఢ్-టఫ్ కింద ఇచ్చే రాయితీ సొమ్ము సెప్టెంబరు 2012 నుంచి విడుదల చేయలేదు. గతంలో దారం ఎగుమతి చేస్తే ప్రోత్సాహకం కింద 3 శాతం సొమ్మును కేంద్రం ప్రోత్సాహకంగా అందించేది. జీఎస్‌టీ వచ్చిన తర్వాత 1.2 శాతానికి తగ్గించారు. ఇటీవల దాన్ని 1.7 శాతానికి పెంచారు. ఇది సకాలంలో విడుదల చేయడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని.. కరెంటు ఛార్జీల భారం తగ్గించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. పవన, సౌర విద్యుత్ ను ప్రోత్సహించి రాయితీలు ఇచ్చినా కొంతమేర భారం తగ్గుతుందని అంటున్నారు.
స్పిన్నింగ్ మిల్లులు తయారుచేసిన దారంలో 65 శాతం దేశీయంగా వినియోగించుకుంటుండగా 35శాతం విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఇందులో చైనాకు సుమారు 28 శాతం వరకు ఎగుమతి అవుతోంది. మిగిలిన 7శాతం వివిధ దేశాలకు వారి అవసరాలకు అనుగుణంగా కౌంట్ తయారుచేసి పంపుతారు. ఏడాదికిపైగా చైనా మన నుంచి దారం కొనుగోలు చేయడం లేదు. దీంతో దేశీయంగా నిల్వలు పెరిగిపోయాయి.
దేశీయంగా అవసరమయ్యే దారం కంటే అదనంగా ఉత్పత్తి చేస్తుండటంతో డిమాండ్ పడిపోయి దారం ధర పతనమైంది. దీంతో ప్రస్తుతం 32 కౌంట్ దారం ధర కిలో 222 రూపాయల నుంచి 225 రూపాయలు మాత్రమే పలుకుతోంది. ఇలా పెరిగిన నిర్వహణ వ్యయం, అంతర్జాతీయంగా మారిన పరిస్థితుల్లో మిల్లులు నడపలేని పరిస్థితుల్లో కొన్ని మూతపడుతున్నాయి. ఒక మిల్లు మూతపడితే సగటున ప్రత్యక్షంగా 800, పరోక్షంగా మరో 200 మంది ఉపాధికి గండి పడుతుంది.
Ferro Alloy Industries: ప్రభుత్వ స్పందన కరవు.. మూసివేతకు సిద్ధమైన 39 ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు
స్పిన్నింగ్ మిల్లు పూర్తిగా మూసివేసినా 25 వేల స్పిండిల్స్ సామర్థ్యం ఉన్న యూనిట్‌కు విద్యుత్తు శాఖకు డిమాండ్ ఛార్జీలు కింద 10 లక్షలు, ట్రూఅప్ ఛార్జీలు కింద 4 లక్షల 64 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఎంతో కొంత ఉత్పత్తి చేస్తూ మిల్లును మూసివేయకుండా మంచి రోజుల కోసం యజమానులు ఎదురుచూస్తున్నారు.