Police media conference on Guntur incident: గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డుపై జరిగిన అవాంఛనీయ ఘటనపై ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఏఎస్పీ అనిల్ మీడియా సమావేశం నిర్వహించారు.బీజేపీ నేత సత్యకుమార్ పై దాడి జరగలేదన్న పోలీస్ అధికారులు.. ఆయన కాన్వాయ్ లో చివరి కారు అద్దాన్ని ఓ యువకుడు పగలగొట్టాడని స్పష్టం చేశారు. కారు అద్దాలు పగలగొట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి.. ముఖ్యమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వల్లే వివాదం తలెత్తిందన్నారు. ఎవరూ సమావేశాల్లో అభ్యంతకర, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని పోలీసు అధికారులు హితవు పలికారు. ఘటనపై ఇరువర్గాలు పిర్యాదు చేసుకున్నాయన్న ఎస్పీ ఆరిఫ్ హఫీజ్... సాంకేతిక ఆధారాలు పరిశీలించి కేసను దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనలో పోలీసులు చట్టపరంగా వ్యవహరించారని.. సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని చెప్పారు.
'నిన్న జరిగిన దాడిలో పూర్తి ఆధారాలు సేకరిచే పనిలో ఉన్నాం. దాడి ఘటనపై సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న వార్తలను దృష్టిలో ఉంచుకొని జరిగిన పరిణామాలను వెల్లడించడానికి మీడియా ముందుకు వచ్చాం. నిన్న రెండు వర్గాల రాజధానికి అనుకూలంగా.. మూడు రాజధానుల కోసం సభలు నిర్వహించారు. అందులో పాల్గొన్న నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. ఇదే అంశంపై వైసీపీ కార్యకర్తలు, బీజేపీ నేతలకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాకు.. వారు వచ్చే అంశంపై పూర్తిగా సమాచారంలేదు. మేము స్పందించేలోపే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరువర్గాలను శాంతింపజేసి పంపించే ప్రయత్నం చేశాం. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి బీజేపీ నేతల కాన్వాయిపై రాయి విసిరాడు. అతన్ని పట్టుకున్నాం. విచారణ చేపట్టాం.'- అనిల్ కుమార్, గుంటూరు ఏఎస్పీ
రాజధాని రైతుల 12వందల రోజుల సభలో పాల్గొని తిరిగి వెళ్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారును అడ్డుకున్నారు. అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై దాడికి తెగబడ్డారు. అద్దాలు ధ్వంసం చేశారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలపైనా దాడులతో రెచ్చిపోయారు.ఆ తర్వాత కారు అద్దాలు పగులగొట్టారు. దాడిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డట్లు ఆరోపించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోవడంతో.. జాతీయ నేత సత్యకుమార్ భద్రతపై బీజేపీ నాయకులు ఆందోళన చెందినట్లు తెలిపారు. ఆయన్ను రక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. చాలాసేపటి తర్వాత అక్కడి నుంచి సత్యకుమార్ ముందుకు సాగిపోయినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఉద్దండరాయునిపాలెంలో మూడు రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులే ఈ దాడికి దిగినట్లు బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఘటన తర్వాత వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్... తన అనుచరులు నిర్వహిస్తున్న మూడు రాజధానుల శిబిరం వద్దకు చేరుకోవడం చర్చనియాంశంగా మారింది.
ఇవీ చదవండి: