గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ రేషన్ వాహనం నుంచి మరో వాహనంలోకి బియ్యం తరలింపు ప్రక్రియ చేస్తుండగా అధికారులు దాడులు నిర్వహించారు. పొన్నూరుకు బియ్యాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్న పోలీసులు.. 70 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు.
'ప్రజాగ్రహం'
పేదలకు ఇంటి వద్దకే రేషన్ బియ్యం ఇచ్చేందుకు తెచ్చిన జగనన్న ఇంటి ఇంటికి రేషన్ బియ్యం వాహనాలు అవినీతికి అడ్డగా మారుతోంది. పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు నేరుగా అధికార వాహనాలనే వినియోగిస్తుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిందితులపై కేసు నమోదు..
ప్రైవేట్ వాహనాన్ని అదుపులోకి తీసుకుని.. రామకోటయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ రేషన్ వాహనాల సిబ్బందిపై తొలుత కేసు నమోదు చేయలేదు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ ఫణీంద్ర స్పందించి.. బియ్యం తరలిస్తున్న ప్రభుత్వ వాహనాల వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సదరు వాహన సిబ్బందిని తొలగించి.. ఆ స్థానంలో కొత్త వారిని నియమిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వాహనాలు నుంచి బియ్యం తరలిస్తున్న వెంకటేష్, సాంబయ్యపై కేసు రిజిస్టర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : మందుపాతరలకే భయపడలేదు.. గులకరాళ్లకు జంకుతానా?: చంద్రబాబు