గుంటూరు జిల్లాలో అనుమానాస్పదస్థితిలో ఆరుగురు మృతి చెందారు. రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. షెడ్డుపై కరెంటు తీగలు పడటం వల్ల విద్యుదాఘాతంతో వీరు మరణించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. రొయ్యల చెరువు వద్ద రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేంద్ర, నవీన్‌ను ఒడిశా వాసులుగా గుర్తించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. షెడ్డుపై కరెంటు తీగలు పడినప్పుడు మంటలు చెలరేగే అవకాశం ఉంది. కానీ మంటలు లేకుండా షెడ్డు లోపలి భాగం కాలిపోవడంపై విద్యుత్ శాఖ అధికారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాకపోవచ్చని అంటున్నారు. షెడ్డు లోపల రసాయనాల వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రమాద స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ప్రమాదం కారణాలపై పోలీసులు ఇంకా అంచనాకు రాలేదు. ఘటనాస్థలి వద్దకు మీడియాను పోలీసులు అనుమతించడం లేదు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
ప్రమాద స్థలాన్ని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ పరిశీలించారు. ఘటనా స్థలిలో బ్లాస్టింగ్ ఆనవాళ్లు లేవని ఎస్పీ తెలిపారు. ప్రమాద సమయంలో గది నుంచి ఇద్దరు బయటకు వచ్చారని తెలిపారు. బ్లీచింగ్ పౌడర్ ఉన్నట్లు ఎఫ్ఎస్ఎల్ అధికారులు చెప్పారని.. ప్రాథమిక ఆధారాల ప్రకారం షార్ట్‌సర్క్యూట్‌గా భావిస్తున్నామని స్పష్టం చేశారు. రాయగఢకు చెందిన ఆరుగురు చనిపోయినట్లు వెల్లడించారు. అక్వా కంపెనీ యజమాని, మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. కీలక ఆధారాల సేకరణ కోసమే మీడియాను అనుమతించ లేదని స్పష్టం చేశారు. అన్ని ఆధారాలు సేకరించామని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశాల్ గున్నీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: