గుంటూరు జిల్లాలోని చుండూరు పోలీస్‌స్టేషన్ ఎస్సై శ్రావణి, అదే స్టేషన్‌లో పనిచేస్తూ ఒకరోజు ముందు వీఆర్‌లోకి వెళ్లిన కానిస్టేబుల్ రవీంద్ర పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. సేకరించిన వివరాల ప్రకారం శ్రావణి గత ఏడాది అక్టోబరులో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. రవీంద్ర అయిదేళ్ల నుంచి అక్కడే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఎస్సై శ్రావణితో సదరు కానిస్టేబుల్ సన్నిహితంగా మెలిగేవాడని తెలుస్తోంది. ఏమైందో తెలియదు కానీ.. వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయంపై చుండూరు సీఐ రమేష్‌బాబును వివరణ కోరగా.. ఎస్సై శనివారం స్టేషన్‌కు రాలేదని, వారిద్దరూ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారనే విషయం తెలియదని బదులిచ్చారు. వారిద్దరే కారులో వెళ్లి ముందుగా తెనాలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరారని పేర్కొన్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 ద్వారా గుంటూరులోని వేర్వేరు ప్రైవేటు వైద్యశాలలకు తరలించినట్టు వెల్లడించారు. వారు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని, సాధారణ స్థితిలోకి వచ్చిన తరువాత విచారించి వివరాలు తెలియజేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: