ప్రఖ్యాత పుణ్యక్షేత్రం గుంటూరు జిల్లాలోని కోటప్పకొండలో శివరాత్రి ఉత్సవాలు కన్నులపండువలా జరిగాయి. గురువారం తెల్లవారుజామున తొలిపూజతో ప్రారంభమైన ఉత్సవాలు...,అర్ధరాత్రి లింగోద్భవ ఘటనతో పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి త్రికూటేశ్వరస్వామిని దర్శించుకుని తరించారు. శివరాత్రి పర్వదినాన కోటయ్యను దర్శించడం భక్తులు గొప్పగా భావిస్తారు. కరోనా ప్రభావం, ఎన్నికల కారణంగా పగటిపూట భక్తుల తాకిడి కొంత తగ్గినా....సాయంత్రానికి ఊపందుకుంది.
ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డితో కలిసి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్... ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. కోటప్పకొండ అభివృద్ధికి చర్యలు చేపడతామని మంత్రి చెప్పారు.
కోటప్పకొండ దిగువ భాగాన విద్యుత్ ప్రభలు కొత్త అందాలు తెచ్చాయి. విద్యుత్ కాంతులతో మెరిసిన ప్రభలను.....కొండపై నుంచి వీక్షిస్తూ భక్తులు పరవశించారు. దర్శనం అనంతరం బయటకు వెళ్లిన భక్తులు......ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొన్నారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోగా...పోలీసులు క్రమబద్ధీకరించారు.
ఇవీ చదవండి